Mother-in-law-Murdered-her-Sister-in-law-in-Vasai

కొడుకును దూరం చేసి యూఎస్ తీసుకెళ్లిందని.. కోడల్ని అంతమొందించిన అత్త

ముంబై: మహారాష్ట్రలోని వసాయిలో దారుణం జరిగింది. తన కొడుకు అమెరికాకు వెళ్లడానికి కారణమై.. తన నుంచి కొడుకును దూరం చేసిందన్న పగతో అత్త.. కోడలినే దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకొచ్చింది. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలోని వసాయికి చెందిన ఆనంది మానె(48), రియా(33) అత్తాకోడళ్లు. ఆనంది కుమారుడు రోహన్(33), రియా(33) ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రియాకు పెళ్లి అయిన కొన్నాళ్లకు అమెరికాలోని టెక్సాస్‌లో నర్స్‌గా ఉద్యోగమొచ్చింది. దీంతో.. భార్యాభర్తలిద్దరూ అమెరికాకు వెళ్లిపోయారు. వీరిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. తన కొడుకు దూరమైపోవడానికి కోడలే కారణమని ఆనంది అప్పటి నుంచి ఆమెపై పగ పెంచుకుంది.

అంతేకాకుండా.. రియా నర్సింగ్ వృత్తిలో కొనసాగడం, ‘రియా’ అనే ఆమె పేరూ.. రెండూ ఆనందికి నచ్చేవి కావని తెలిసింది. చాలాసార్లు ఈ రెండూ మార్చుకోవాలని ఆనంది రియాకు చెప్పింది. అయినా ఆమె వినకపోవడంతో ఆనంది కోపం రెట్టింపయింది. అమెరికాలోనే స్థిరపడిన రోహన్, రియా డిసెంబర్ 1న జరిగిన ఓ శుభకార్యానికి ఇండియాకు వచ్చారు.
 
తన ఆరు నెలల మనవరాలిని ఆడించేందుకు కూడా రియా దగ్గరకు రానిచ్చేది కాదని.. ఆదివారం ఉదయం తన భర్త, రోహన్ మార్నింగ్ వాక్‌కు వెళ్లగానే కోడలి గదిలోకి వెళ్లి పక్కనే ఉన్న ఫ్లవర్‌వాజ్‌తో ఆమె తలపై బలంగా మోదినట్లు నిందితురాలు ఆనంది పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన సందర్భంలో చెప్పింది. ఆమె చెప్పిన వెంటనే ఇంటికి వెళ్లిన పోలీసులు తీవ్ర రక్తస్రావంతో రియా అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. పోలీసులు ఆనందిని అదుపులోకి తీసుకున్నారు. రియా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కొడుకుపై పెంచుకున్న అమితమైన ప్రేమతో కోడలిని చంపేసిన ఆనంది.. మరో బిడ్డకు తల్లిని దూరం చేస్తున్నానన్న సంగతే మర్చిపోవడం గమనార్హం.