Mother-Daughter-Co-Pilot-Flight

అమెరికాలో తల్లీకూతుళ్లు నడుపుతున్న విమానం.. వైరలైన ట్వీట్

కాలిఫోర్నియా: లాస్ ఏంజెల్స్ నుంచి అట్లాంటా వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఆ విమాన నడుపుతున్న ఇద్దరు పైలట్లు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారారు. ఎందుకంటే ఆ విమానాన్ని ఇద్దరు మహిళలు నడుపుతున్నారు. దీనిలో వింతేముంది అనుకుంటున్నారా? వారిద్దరూ తల్లీకూతుళ్లు. ఆ విమానంలో ప్రయాణించిన ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ చాన్సలర్ జాన్ ఆర్. వాట్రెట్ వీరి ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘ఇప్పుడే తల్లీకూతుళ్ల విమానంలో ప్రయాణించా. ఇది మహిళలందరూ గర్వించాల్సిన విషయం’ అంటూ ఆ ఇద్దరు పైలట్ల ఫొటోను షేర్ చేశారు. దీనిపై చాలామంది నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఈ తల్లీకూతుళ్ల జంట ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. అసలు పైలట్లుగా ఆడవారు ఉండటమే అరుదు. అలాంటిది ఒకే కుటుంబానికి చెందిన వారు కలిసి ఆ విమానాన్ని నడుపుతుండటంతో నెటిజన్లు దీనిపై విపరీతమైన ఆసక్తి కనబరిచారు.