టెనస్సీ: అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై సెప్టెంబర్ 11, 2001లో అల్‌ఖైదా ఉగ్రవాదులు జరిపిన ఉగ్రదాడి అగ్రరాజ్యం చరిత్రలోనే చేదు ఘటన అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దాడిలో సుమారు 3వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాలన్నింటినీ ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలపై ఆల్‌ఖైదా పక్కా వ్యూహంతో జరిపిన దాడులవి. ఈ మారణహోమానికి ఈ ఏడాది సెప్టెంబర్ 11తో సరిగ్గా 18 ఏళ్లు పూర్తయ్యాయి. ఇదిలాఉంటే యూఎస్‌కు మానని గాయంగా మిగిలిపోయిన ఈ ఘటన 18వ వార్షికోత్సవం నాడే ఒక మిరాకిల్ సంఘటన జరిగింది. అమెరికాలోని టెనస్సీలో ఉండే క్రిస్టినా మేలోన్ బ్రౌన్, జస్టిన్ బ్రౌన్ దంపతులకు సెప్టెంబర్ 11న రాత్రి 9 గంటల 11 నిమిషాలకు ఒక చిన్నారి పుట్టింది. ఇదేదో యాదృచ్చికంగా జరిగిందిలే అనుకోవచ్చు.
కాని అదే చిన్నారి విషయంలో మరో ఆశ్చర్యకర విషయం ఇప్పుడు అందిరినీ షాకయ్యేలా చేస్తోంది. అదే బాలిక బరువు. చిన్నారి సరిగ్గా 9 పౌండ్ల 11 ఔన్స్ బరువు(4.39 కిలోలు)తో జన్మించింది. టెనస్సీలోని మెథడిస్ట్ లే బోన్హూర్ జర్మన్‌టౌన్ ఆసుపత్రిలో ఈ మిరాకిల్ సంఘటన చోటుచేసుకుంది. చిన్నారి విషయంలో జరిగిన ఈ యాదృచ్చిక సంఘటనలు ఆసుపత్రి సిబ్బందితో పాటు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఇదో ప్రపంచ వింతగా మారిపోయింది. ఈ ఆసుపత్రిలో గత 35 ఏళ్లుగా పనిచేస్తున్న ఓ మహిళ మాట్లాడుతూ చిన్నారి పుట్టుక చారిత్రాత్మక సంఘటన అని అభివర్ణించింది. ఇక బ్రౌన్ దంపతుల ఆనందానికైతే అవధుల్లేకుండా పోయాయి. తమ కూతురు పెద్దయ్యాక ఆమె పుట్టిన తేదీ, సమయం, బరువు ఎందుకు చాలా ముఖ్యమైనవో ఆమెకు చెబుతామని మురిసిపోతున్నారు.