Message-In-A-Bottle-Found-In-Australia-50-Years-On

50 ఏళ్ల క్రితం సముద్రంలో విసిరిన బాటిల్.. అందులో ఓ సందేశం

ఆస్ట్రేలియా: పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఓ బీచ్‌లో జ్యా ఎలియట్(9) అనే కుర్రాడికి గత మంగళవారం ఓ సీసా దొరికింది. ఆ సీసాలో ఏదో కాగితం కూడా ఉండటంతో ఏంటా అని తీసి చదివాడు. ఆ కాగితంలో ఓ అడ్రస్ ఉండి, ఈ సీసా మీకు దొరికితే ఈ అడ్రస్‌కు రిప్లై ఇవ్వండి అంటూ రాసి ఉంది. పశ్చిమ ఆస్ట్రేలియా ఫ్రీమాంటిల్‌కు వెయ్యి మైళ్లు దూరంలో ఉన్న ఓ అడ్రస్‌ అందులో కనిపించింది. ఆ కాగితం పాల్ గిల్మోర్ అనే ఓ ఇంగ్లీషు వ్యక్తి నవంబరు 17, 1969లో రాసినట్టు లెటర్‌ చదివాక ఎలియట్‌కు అర్థమైంది. మొదట ఇదంతా ఫేక్ అనుకున్న ఎలియట్, తరువాత నిజం తెలుసుకుందామనుకున్నాడు. కాగితంలో ఉన్న అడ్రస్‌కు నిజంగానే సందేశాన్ని పంపించాడు. ఎలియట్ పంపిన సందేశం పాల్ గిల్మోర్ ఇంటికి నిజంగానే వెళ్లింది. 50 ఏళ్ల క్రితం పంపిన సందేశానికి ఇప్పుడు స్పందన రావడం ఆశ్చర్యంగా.. అదే విధంగా ఆనందంగా ఉందని పాల్ గిల్మోర్ కుటుంబసభ్యులు తెలిపారు. పాల్ గిల్మోర్ తన 13వ యేట మొత్తం 6 లెటర్లను ఇలానే రాసి బాటిళ్లలో పెట్టి సముద్రంలో విసిరినట్టు ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు. పాల్ గిల్మోర్ వయసు ఇప్పుడు 63 అని, ఆయన ఓ రచయిత అని తెలిపారు. పాల్ గిల్మోర్ ప్రస్తుతం ఓ క్రూజ్ షిప్‌లోనే షికారుకు వెళ్లాడని, తిరిగి వచ్చిన వెంటనే ఈ సందేశాన్ని చూసి ఎంతో సంతోషిస్తాడని పాల్ గిల్మోర్ సోదరి చెప్పింది.