medicine-for-stalling-diabetes-

మధుమేహాన్ని అడ్డుకునే ఔషధం.. కనిపెట్టిన శాస్త్రవేత్తలు..

  • రూపొందించిన యేల్‌ వర్సిటీ పరిశోధకులు

న్యూయార్క్‌, జూన్‌ 11: టైప్‌-1 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కనీసం రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఏళ్లపాటు ఆలస్యం చేసే విప్లవాత్మక చికిత్సావిధానాన్ని యేల్‌ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. వారు తయారుచేసిన టెప్లిజుమాబ్‌ అనే ఔషధాన్ని.. టైప్‌-1 డయాబెటిస్‌ వచ్చే ముప్పున్నవారికి ఇచ్చి చూడగా, వారిలో ఆ తరహా మధుమే హం వచ్చే అవకాశం తగ్గింది. రెండో దశ క్లినికల్‌ ప్రయోగాల అనంతరం ఈ చికిత్సా విధానం గురించి ‘న్యూఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’లో ఒక వ్యాసాన్ని ప్రచురించారు. టైప్‌-1 డయాబెటి్‌సను ఆలస్యం చేసే తొలి ఔషధం ఇప్పటివరకూ ఇదే.


ఏమిటీ టైప్‌-1 డయాబెటిస్‌?

ఇదో ఆటోఇమ్యూన్‌ వ్యాధి. మన రోగనిరోధకవ్యవస్థలోని టి-కణాలు.. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాలపై పొరపాటున దాడి చేసి ధ్వంసం చేసేస్తుంటాయి. దీంతో ఆ కణాలు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేవు. గ్లూకోజ్‌ను శక్తిగా మార్చే ఇన్సులిన్‌ ఉత్పత్తి కాకపోవడంతో శరీరంలో చక్కెరస్థాయులు పెరిగిపోతాయి. దీన్ని టైప్‌-1 మధుమేహం అంటారు. జన్యుసంబంధిత కారణాలవల్ల చాలామందికి చిన్నవయసులోనే వస్తుంది.


పరిశోధన ఇలా..

పరిశోధనలో భాగంగా యేల్‌ వర్సిటీ పరిశోధకులు 8 నుంచి 49 ఏళ్ల దాకా వివిధ వయసుల్లో ఉన్న 76 మందిని తీసుకున్నారు. వీరంతా ఇప్పటికే టైప్‌-1 మధుమేహంతో బాధపడుతున్నవారి బంధువులు. ఈ 76 మంది శరీరాల్లోనూ కనీసం రెండు రకాల మధుమేహ సంబంధిత ఆటో యాంటీబాడీస్‌ (రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసే ఒకరకం ప్రొటీన్స్‌) ఉన్నాయి. వారిని రెండు బృందాలుగా విభజించి కొందరికి 14 రోజులపాటు టెప్లిజుమాబ్‌ ఇచ్చారు. మిగతావారికి ప్లాసిబో (ఉత్తుత్తి మాత్ర) ఇచ్చారు. అందరికీ తరచుగా గ్లూకోజ్‌ టాలరెన్స్‌ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల సమయంలో ప్లాసిబో తీసుకున్నవారిలో 72 శాతం మందికి టైప్‌-1 మధుమేహం వచ్చింది. టెప్లిజుమాబ్‌ తీసుకున్నవారిలో 43 శాతం మందికే టైప్‌-1 మధుమేహం వచ్చింది. ప్లాసిబో గ్రూపులోనివారికి సగటున 24 నెలల్లో మధుమేహం రాగా.. టెప్లిజుమాబ్‌ తీసుకున్న గ్రూపులో వారికి అందుకు సగటున 48 నెలల కాలం పట్టింది.


టెప్లిజుమాబ్‌ ఏం చేస్తుందంటే..
ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటాసెల్స్‌ రోగనిరోధకవ్యవస్థలోని టి-సెల్స్‌ దాడికి ధ్వంసమయ్యే వేగాన్ని తాము రూపొందించిన టెప్లిజుమాబ్‌ ఔషధం మందగింపజేస్తుందని యేల్‌ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. టైప్‌-1 మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి తొలి నుంచే ఈ ఔషధం ఇవ్వడం వల్ల మరింత ఉపయోగం ఉంటుందా అనే అంశంపై పరిశోధనలు చేయనున్నట్టు వారు వివరించారు. కాగా.. వయసు, శరీరంలోని వ్యవస్థల పనితీరు వంటి ఎన్నో అంశాలు టెప్లిజుమాబ్‌ పనితీరుపై ప్రభావం చూపుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఔషధానికి బాగా స్పందించిన వారి శరీరంలో కొన్నిరకాల యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఇది 76 మందిపైన మాత్రమే చేసిన ప్రయోగమని.. ఈ ఔషధంపై ఇంకా పూర్తిస్థాయి పరిశోధనలు చేయాల్సి ఉందని వారు పేర్కొన్నారు.