Man-Saved-by-Mobile-Phone

సెల్‌ఫోన్ వల్ల బతికిపోయాడు

న్యూసౌత్‌‌వెల్స్‌: సెల్‌ఫోన్ వచ్చిన తర్వాత ప్రమాదాలు చాలా ఎక్కువైపోయాయి. దానికి బానిసలుగా మారి చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవడంలేదు. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఫోన్ మత్తులో పడిపోతున్నారు. అసలు సెల్‌‌ఫోన్ చేతిలో లేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్‌తో ఇబ్బంది పడిపోతున్నారు. యువతలో అయితే ఈ పిచ్చి బాగా ముదిరిపోయింది. దీంతో అటు తల్లిదండ్రులు.. ఇటు నిపుణులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలంటూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. అయితే, దీనికి భిన్నంగా సెల్‌ఫోన్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. ఈ ఆసక్తికర సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.

న్యూసౌత్‌‌వెల్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణలో విల్లు ధరించిన ఓ గుర్తు తెలియని వ్యక్తిని చూశాడు. వెంటనే తన జేబులోని సెల్‌ఫోన్ తీసి అతడిని ఫొటో తీయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ దుండగుడు.. ఫొటో తీస్తున్న వ్యక్తిపైకి విల్లును వదిలాడు. అది రెప్పపాటులో దూసుకొచ్చింది. అయితే, ఆ సమయంలో అతడికి సెల్‌ఫోన్ అడ్డుగా ఉండడంతో, దానిని గుచ్చుకుని అది కింద పడిపోయింది. ఈ ఘటనలో సదరు వ్యక్తి గడ్డానికి చిన్న గాయం అయింది. నిందితుడిని న్యూసౌత్‌‌వెల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని వాళ్లు సోషల్ మీడియాలో వెల్లడించారు.