Man-rapes-a-woman-in-public-park

పార్కులో యువతిపై అత్యాచారం.. ఆమె దుస్తులు తీసుకుని అతడు పరార్

దుబాయి: పక్షుల కిలకిలారావాలు వింటూ ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడుస్తున్నారా ప్రేమికులు. మార్నింగ్ వాక్ కోసం పార్కుకు చేరుకొన్నారు. ప్రకృతి అందాలను చూస్తూ మైమరచిపోతున్న ఆ జంటను ఓ వ్యక్తి అడ్డగించాడు. ‘మీరెవరు, ఎందుకొచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. అతని ప్రవర్తన అనుమానం కలిగించడంతో అతనికి బదులివ్వడానికి ఆ యువకుడు నిరాకరించాడు. అసతు అతనెవరో చెప్పాలని, తమ వ్యక్తిగత వివరాలు వెల్లడించాల్సిన అవసరం తమకు లేదని ఎదురు తిరిగాడు. దాంతో తాను ప్రభుత్వ అధికారినని, మీ ఐడీ కార్డులు చూపించాలంటూ ఆ పార్కులోని వ్యక్తి ఒత్తిడి చేశాడు. పార్కు బాధ్యతలు తనకు అప్పగిస్తున్నట్లు ఉన్న ఓ కాగితాన్ని ఆ జంటకు చూపించాడు. దీంతో కొంత శాంతించిన ఆ యువకుడు తమ ఐడీ కార్డులు ఇంట్లో మర్చిపోయామని, కొంత సమయమిస్తే తీసుకొస్తానని చెప్పి ఇంటికి వెళ్లాడు. పార్కులోనే మిగిలిపోయిన అతని ప్రేయసి ఒంటరిదైపోయింది. అదే అదనుగా భావించిన ఆ పార్కులోని వ్యక్తి ఆమెను బలవంతంగా పొదలచాటుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి, ఆమె బయటకు రాకుండా ఉండేందుకు ఆమె దుస్తులు తీసుకొని పారిపోయాడు. నగ్నంగా అందరిముందుకు రాలేని ఆ యువతి అదే పొదలో చాలాసేపు తన ప్రియుడి కోసం ఎదురుచూసింది. కానీ ట్రాఫిక్ జామ్ అవడంతో అతను రావడం ఆలస్యం అయింది. అతని కోసం ఎదురుచూసిన ఆ యువతి కాసేపటి తర్వాత అటుగా వచ్చిన కొందరు మహిళలను సాయం అడిగింది. వారు ఆమెకు కొన్ని దుస్తులిచ్చారు. అప్పటికి ఆమె ప్రియుడు అక్కడకు చేరుకొని విషయం తెలుసుకొని ఆగ్రహంతో ఊగిపోయాడు. అట్నుంచి అటే పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వారు పార్కులోని సీసీకెమెరాలను పరిశీలించి, నిందితుడిని గుర్తించారు. ఆ పార్కులో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలూ జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం నియమించిన అధికారే ఈ అమానుషానికి ఒడిగట్టాడని గుర్తించి అతన్ని అరెస్టు చేశారు.