Man-donates-kidney-to-stranger

కాగితం చూసి.. కిడ్నీ త్యాగం చేసిన మహానుభావుడు

స్కాట్లాండ్: ఒక మనిషి మరో మనిషికి డబ్బు పరంగా, ఉద్యోగ పరంగా సాయం చేయడం గురించి నిత్యం వింటూనే ఉంటాం. కానీ, స్కాట్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి మరో మనిషి బాధను చూసి ఏకంగా తన కిడ్నీనే త్యాగం చేశాడు. వినడానికే వింతగా ఉంది కదూ. కానీ ఇది నిజం. వివరాల్లోకి వెళ్తే.. రే డఫ్పీ(53) అనే వ్యక్తి ఈ-కామర్స్ వెబ్‌సైట్ నుంచి తన భార్యకు 2013లో ఓ డ్రస్ ఆర్డర్ చేశాడు. ఆ డ్రస్‌ను అమ్మిన సెల్లర్ ఐటమ్‌తో పాటుగా.. థ్యాంక్స్ చెబుతూ మరో నోట్ పంపింది. ఆ నోట్‌లో వస్తువు కొన్నందుకు ధన్యవాదాలు చెబుతూనే.. తన భర్తకు కిడ్నీ ఆపరేషన్ చేయాల్సి ఉందని చెప్పుకొచ్చింది. ఆమె గీసిన బొమ్మలు కూడా ఐటమ్‌లో ఉండటంతో రే డఫ్పీకి ఆ బొమ్మలు బాగా నచ్చాయి. 

కిడ్నీ ఆపరేషన్ కారణంగా తన భర్త ఉద్యోగం కూడా పోయిందని.. ప్రస్తుతం తాము ఇలా ఆన్‌లైన్‌లో వస్తువులు అమ్ముతూ జీవనం గడుపుతున్నామని రాసింది. అది చదివిన తరువాత రే డఫ్పీ హృదయం చలించిపోయింది. సాయం చేయాలనుకున్నాడు కానీ.. ఎలా చేయాలో అర్థం కాలేదు. అలా రెండేళ్లు గడిచిపోగా.. ఒక రోజు రేడియో ప్రోగ్రామ్‌లో కిడ్నీ డొనేట్ చేసే వారి గురించి విన్నాడు. ఒక కిడ్నీ డొనేట్ చేసిన వారు కూడా ఎంతో ఆరోగ్యంగా బతుకుతున్నారని ఆ ప్రోగ్రామ్‌లో వినగానే తన కిడ్నీని త్యాగం చేసేందుకు సిద్దమయ్యాడు. వెంటనే ఆసుపత్రికి చేరుకుని ఎవరో తెలియని వ్యక్తికి తన కిడ్నీని డొనేట్ చేసేశాడు. తాను చాలా రిస్క్ చేశాననే సంగతి తనకు తెలుసని.. కానీ తాను మరొకరి జీవితంలో వెలుగు నింపినందుకు ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఆన్‌లైన్‌లో మహిళ పంపిన నోట్‌ను తన దగ్గరే భద్రంగా దాచుకున్నానని.. తనలో ఉన్న బాధను తీర్చుకున్నానని రే డఫ్పీ గర్వంగా చెప్పాడు.