Malaria-cases-and-deaths-declined-by-50-percent-in-India

భారత్‌లో సగం తగ్గిన మలేరియా

లండన్‌, అక్టోబరు 9 : మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం ఫాల్సిపారం పరాన్నజీవిని నిర్వీర్యం చేయగల రసాయన సమ్మేళనం ఆవిష్కృతమైంది. ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లాక్సో స్మిత్‌క్లైన్‌, బ్రెజిల్‌కు చెందిన సావోపాలో పరిశోధనా సంస్థల సంయుక్త పరిశోధనల్లో అభివృద్ధి చేసిన ఈ సమ్మేళనానికి ‘టీసీఎండీసీ -135051’ అని పేరుపెట్టారు. పరాన్నజీవికి ఆయువుపట్టులాంటి పీఎఫ్‌సీఎల్‌కే-3(సైక్లిన్‌ డిపెండెంట్‌ లైక్‌ ప్రొటీన్‌ కినేస్‌) అనే ప్రోటీన్‌లోకి రసాయన సమ్మేళ నం చేరగానే, అందులో జరిగే పునరుత్పత్తి ప్రక్రియ నిలిచి పోతుందని ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో గుర్తించారు. 25వేల రకాల రసాయన సమ్మేళనాల్లో ‘టీసీఎండీసీ -135051’ సమ్మేళనమే మలేరియా పరాన్నజీవి ఆటకట్టించింది.

భారత్‌లో సగం తగ్గిన మలేరియా 

లండన్‌, అక్టోబరు 9: భారత్‌లో మలేరియా వ్యాప్తి సగం తగ్గింది. 2013తో పోల్చితే 2017లో మన దేశంలో మలేరియా మరణాలు 50.52 శాతం తగ్గాయి. ఇక ఇదేకాలానికి ఆ జ్వరం బారినపడిన వారి సంఖ్య 49.09 శాతం మేర తగ్గింది. జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం)పై సమీక్షలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ గణాంకాలు ప్రకటించారు. ఇదే అదుపు రేటును కొనసాగిస్తే.. 2030 కల్లా మలేరియాను దేశం నుంచి తరిమికొట్టడం సాధ్యమేనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్‌హెచ్‌ఎం పనితీరు మెరుగైన కారణంగా మలేరియా కేసుల గుర్తింపు 16 శాతం దాకా పెరిగిందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.