London-based-NRI-lawyer-sues-supermarket-chain-Tesco-over-chocolate-bar

నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టుకెక్కిన భారతీయుడు.. లండన్‌లో..

లండన్: బ్రిటన్‌లోని ప్రముఖ సూపర్ మార్కెట్ ‘టెస్కో’పై ఓ భారత సంతతి లాయర్ కోర్టుకెక్కాడు. ఆ సంస్థలో పనిచేసే ఓ సెక్యూరిటీ గార్డ్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని, అతని వల్ల తన కిడ్నీలో రాళ్లు కదిలిపోయాయని ఆయన ఆరోపించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లాలూ హనుమాన్ అనే భారత సంతతి వ్యక్తి లండన్‌లో ఉంటున్నాడు. ఇంటికి దగ్గరలోని ‘టెస్కో’ సూపర్ మార్కెట్‌కు వెళ్లి ఓ చాక్లెట్ బార్ కొనుగోలు చేశాడు. దానికి డబ్బు చెల్లించి బిల్లును చెత్త బుట్టలో పడేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చేప్పుడు, అక్కడి సెక్యూరిటీ గార్డు హనుమాన్‌ను అడ్డగించాడు. అతని చేతిలోని చాక్లెట్‌కు బిల్లు చూపించాలని హనుమాన్‌ను నిలదీశాడు. తాను బిల్లు చెల్లించానని చెప్పినా సెక్యూరిటీ గార్డు వినలేదని, తనతో దురుసుగా ప్రవర్తించాడని హనుమాన్ ఆరోపించాడు. సెక్యూరిటీ గార్డు తనను గట్టిగా పట్టుకొని షాపులోకి లాక్కొచ్చాడని, దానివల్ల తన కిడ్నీ రాళ్లు కదిలిపోయాయని హనుమాన్ అంటున్నాడు. తనకు 70వేల పౌండ్లు(సుమారు రూ.65లక్షలు) నష్టపరిహారం చెల్లించాలంటూ ‘టెస్కో’ కంపెనీపై కోర్టులో దావావేశాడు.