Kim-upper-hand-on-Trump

కిమ్‌ చేతిలో ట్రంప్‌ బోల్తా

సింగపూర్‌ భేటీలో అమెరికా షరతులకు లొంగని ఉత్తర కొరియా అధినేత

అణ్వస్త్ర నిర్మూలనకు ఓకే
కానీ డెడ్‌లైన్లు లేవు
దక్షిణ కొరియాతో నౌకా విన్యాసాలు ఆపేస్తాం: అమెరికా

ఉత్తర కొరియా భద్రతకు పూర్తి పూచీ

ప్రపంచం పెద్ద మార్పును చూస్తుంది.. 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో నేను జరిపిన శిఖరాగ్ర సదస్సు ఓ మార్పు దిశగా వేసిన అడుగు. రాబోయే కాలంలో ప్రపంచం ఓ పెద్ద మార్పును చూస్తుంది. గతం మన దారిలో ఎన్నో అడ్డంకులు పెట్టింది. ఆ గతాన్ని వదలేద్దాం. ఈ స్థాయి వరకూ (చర్చల దాకా) రావడం నిజానికి ఎంతో కష్టం. మనం అన్నింటినీ అధిగమించాం.
- ఉత్తర కొరియా అధినేత కిమ్‌
 
నిన్నటి ఘర్షణ రేపటి యుద్ధం కారాదు
గతం ఎన్నటికీ భవిష్యత్తును నిర్దేశించకూడదు. నిన్నటి ఘర్షణ రేపటి యుద్ధానికి దారితీయకూడదు. అణ్వస్త్ర తయారీ కేంద్రాన్ని కిమ్‌ ధ్వంసం చేస్తారని ఆశిస్తున్నా. అణ్వస్త్ర నిర్మూలన దిశగా చేపట్టబోయే చర్యలపై మరిన్ని సమావేశాలు జరుగుతాయి. ప్రస్తుతం కొరియా ద్వీపకల్పంలో 32వేల మంది అమెరికన్‌ సైనిక బలగం ఉంది. వారందరినీ వెనక్కి రప్పిస్తా. కానీ ఇప్పుడే కాదు. భవిష్యత్తులో కిమ్‌ను శ్వేతసౌధానికి ఆహ్వానిస్తా.
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌
 
స్థూలంగా చూస్తే.. సింగపూర్‌లోని సెంతోసా దీవిలో కొత్త చరిత్రకు నాంది పడింది. అమెరికా, ఉత్తర కొరియా దేశాల అధినేతలు- డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జాంగ్‌ ఉన్‌ల శిఖరాగ్ర సమావేశం మంగళవారం ఉదయం ఓ విలాసవంతమైన హోటల్‌లో జరిగింది. పరస్పర పరిచయాలయ్యాక- అనువాదకుల సాయంతో ఇద్దరు నేతలూ సుమారు 45 నిమిషాల సేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. తరువాత ప్రతినిధుల బృందాలతో కలిసి చర్చల్లో పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా రెండు దేశాల అధికారగణం చర్చించి రూపొందించిన ఒప్పందాన్ని పరిశీలించి దానికి ఆమోదముద్ర వేశారు. ఓ సంయుక్త సమగ్ర ఒప్పందంపై సంతకాలు చేశారు. ఉత్తర కొరియా, అమెరికాల సిట్టింగ్‌ అధినేతలు ఇలా ఓ ఒప్పందానికి రావడం ఇదే తొలిసారి. ఈ ఒప్పందాన్ని పూర్తిగా అమెరికా విజయంగా అభివర్ణించలేమని దౌత్య నిపుణులు అంటున్నారు.
 
అమెరికా కోరుకున్నవేవీ ఇందులో లేవు. అణ్వస్త్ర నిర్మూలన జరపడానికి ఉత్తర కొరియా ఒప్పుకుంది... కానీ ఎప్పటిలోగా, ఎలా చేసేదీ చెప్పలేదు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే తో ఏప్రిల్‌ 27న కుదుర్చుకున్న పాన్మున్‌జామ్‌ ఒప్పందానికి కిమ్‌ మరోమారు ఆమోదముద్ర వేశారంతే! అమెరికా గట్టిగా పట్టుబట్టిన సీవీఐడీ- అంటే సంపూర్ణమైన, తనిఖీలకు అవకాశమిచ్చే, వెనకడుగుకు ఆస్కారం లేని అణ్వస్త్ర నిర్మూలన-(కంప్లీట్‌, వెరిఫైయబుల్‌, ఇర్రివర్సిబుల్‌ డీన్యూక్లియరైజేషన్‌) అనే పదం ఎక్కడా ఒప్పందంలో లేనేలేదు. ఈ సీవీఐడీకి అంగీకరిస్తేనే ఒప్పందం లేదా లేనేలేదు అని 24 గంటల కిందట అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో చేసిన ప్రకటన నోటి మాటగానే మిగిలిపోయింది. కిమ్‌ దానికి ఒప్పుకోలేదని తేలిపోయింది.
 
ప్లుటోనియం, యురేనియం ప్రాసెసింగ్‌లను స్తంభింపజేస్తామన్న ప్రస్తావనే లేదు.. అణు పరీక్షలు జరపబోమన్న హామీ లేదు. అణు కార్యక్రమ వివరాలు వెల్లడించడానికీ ఒప్పుకోలేదు. అణు తనిఖీలు ఉండవు. అణ్వస్త్ర నిర్మూలనకు డెడ్‌లైన్లు లేవు. అసలు ఏ విషయంలోనూ కిమ్‌ను ట్రంప్‌ ఒప్పించలేకపోయారు సరికదా, ఆయనకు ఎదురు రాయితీలిచ్చేశారు. ఇవేంటంటే... 1) ఇకపై ఉత్తర కొరియా భద్రతను అమెరికా తీసుకోడానికి అంగీకారం. 2) కొరియా ద్వీపకల్పంలో దక్షిణ కొరియాతో కలిసి చేస్తున్న సైనిక విన్యాసాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తున్నట్లు ప్రకటన.. ఈ చర్య ద్వారా అటు ప్రపంచాన్నే కాక ఇటు కొరియన్లనూ ట్రంప్‌ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే దళాల ఉపసంహరణ గురించి మాత్రం ఎక్కడా అమెరికా అంగీకరించకపోవడం కొంత మెరుగని అమెరికన్‌ దౌత్యవేత్తలు అంటున్నారు.
 

ఆర్థికంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ఉత్తర కొరియాను సులభంగా దారికి తెచ్చుకోవచ్చన్న అమెరికా ఆశలు కల్లలయ్యాయి. ట్రంప్‌ బుట్టలో కిమ్‌ పడలేదు సరికదా, కిమ్‌దే పైచేయి అయింది. సంప్రదింపుల్లో సమర్థుడని తేలింది. న్యూయార్క్‌ టైమ్స్‌ విశ్లేషణ ప్రకారం- అత్యుత్సాహం చూపిన ట్రంప్‌- కిమ్‌కు ఓ ప్రతినిధిలా మారిపోయారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే- ఉత్తరకొరియా పదేపదే చేస్తున్న ఓ నిందను నిజమేనని ట్రంప్‌ ఒప్పుకోవడం! సైనిక విన్యాసాల ద్వారా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను అమెరికా రెచ్చగొడుతోంది అని కిమ్‌ గతంలో చేసిన విమర్శను ట్రంప్‌ అంగీకరించారు.

ఒప్పంద విశేషాలివీ..
ఒప్పందంలో 4 ప్రధాన అంశాలున్నాయి.
ఏప్రిల్‌ 27న ఉత్తర-దక్షిణ కొరియా అధినేతల మధ్య కుదరిన పాన్మున్‌మోన్‌జామ్‌ ఒప్పందం (డిక్లరేషన్‌) ప్రకారం- కొరియా ద్వీపకల్పాన్ని పూర్తిగా అణ్వస్త్ర రహితం చేయడానికి ఉత్తర కొరియా అంగీకారం
కొరియా ద్వీపకల్పంలో శాశ్వత శాంతి స్థాపనకు అమెరికా, ఉత్తర కొరియా కలిసి కృషిచేస్తాయి
ఉత్తర కొరియా జైళ్లలో మగ్గుతున్న యుద్ధ ఖైదీలు, ఎంఐఏల (ఆచూకీ దొరకలేదని రికార్డుల్లో ఉన్న వ్యక్తులు) విడుదల, వారి వారి స్వదేశాలకు పంపడానికి అంగీకారం
అమెరికా, ఉత్తర కొరియా దేశాల ప్రజల అభీష్టానుసారం రెండు దేశాల సంబంధాల్లో మార్పు తెచ్చి, సుహృద్భావంగా మల్చడం