Kerala-Man-Died-in-Road-Accident-in-Ras-Al-Khaimah-who-Amid-Plans-to-Surprise-his-Family

పండుగకు ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను సర్‌ప్రైజ్ చేద్దామనుకున్న కేరళ వాసి.. చివరకు

రాస్ అల్ ఖైమా: బతుకు దెరువు కోసం రాస్ అల్ ఖైమా వెళ్లిన కేరళకు చెందిన ఓ వ్యక్తిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కేరళలోని త్రిస్సూర్ కల్లూర్ వాసి సునీల్(44) గత మంగళవారం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఓనం పండుగకు తాను ఇంటికి వస్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పకుండా సర్‌ప్రైజ్ చేద్దామనుకుని సోమవారం రాత్రే విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు. మంగళవారం ఉదయం షాపింగ్ కోసమని తన ద్విచక్ర వాహనంపై సునీల్ బయటకు వచ్చాడు. షాపింగ్ పూర్తి చేసుకొని తిరిగి వెళ్తుండగా అల్ ఘైల్ వద్ద సునీల్ బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని స్నేహితులు అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. దీంతో వారు కన్నీటిపర్యంతమవుతున్నారు. సునీల్ మృతదేహాన్ని అక్కడి అధికారులు అతడి స్వస్థలానికి మంగళవారం ఉదయం పంపించారు. కాగా, సునీల్ రాస్ అల్ ఖైమాలో స్నేహితులతో కలిసి బిజినెస్ చేస్తూనే ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. సునీల్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సునీల్ మృతితో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పండుగ పూట అతడి ఇంట విషాదం నెలకొంది. 

 

Related Articles