Kerala-Flood-Hero-Became-Overnight-Star-gets-Surprise-Gift-from-Dubai

కేరళ వరదలు.. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఓవర్‌నైట్ హీరో.. దుబాయి నుంచి సర్‌ప్రైజ్ గిఫ్ట్

దుబాయి: ఇటీవల కేరళను వరదలు ముంచెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక వరదల వల్ల సర్వం పొగొట్టుకున్న జనాలకు నిలువ నీడ లేకపోవడంతో పాటు పూట గడవడం కూడా కష్టంగా ఉంది. దీంతో కొందరు దయగల వారు వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇలా వరద బాధితులను ఆదుకున్నాడు కొచ్చికి చెందిన బట్టల వ్యాపారి నౌషద్. బక్రీద్ పండగ కోసం అమ్మేందుకు తీసుకొచ్చిన బ్రాండెడ్ బట్టలను వరద బాధితులకు ఉచితంగా పంచిపెట్టాడు. నౌషద్ దుస్తులు పంచిపెడుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. 

 
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నౌషద్ చేసిన మంచి పనికి సామాన్యుల నుంచి సినిమా స్టార్లు, రాజకీయ నేతలు, ప్రభుత్వాధికారులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నౌషద్‌ను ప్రశంసించిన వారిలో పీడబ్ల్యూడీ మంత్రి జీ సుధాకరన్, ఎర్నాకులం జిల్లా కలెక్టర్ ఏస్ సుహాస్, సినీనటుడు అసిఫ్ అలీ ఉన్నారు. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ అయితే నౌషద్ ఫొటోను పోస్ట్ చేసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి కూడా నౌషద్‌ను అభినందించారు. ప్రత్యేకంగా ఫోన్ చేసి అతడితో మాట్లాడారు. ఈద్ గ్రీటింగ్ చెప్పడంతో పాటు నీవు చేసిన మంచి పని వెలకట్టలేనిది అని ప్రశంసించారు. మరో నటుడు జయసూర్య కూడా నౌషద్‌ను అభినందనలు తెలిపారు. 
 
ఇక సోషల్ మీడియా వేదికగా రాత్రికిరాత్రే పాపులర్ అయిన నౌషద్‌కు యుఏఈ ప్రవాసుల నుంచి సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందింది. నౌషద్‌కు సంబంధించిన వీడియోను దుబాయిలో ఉండే మలయాళి వ్యాపారవేత్త అఫి అహ్మద్ సోషల్ మీడియాలో చూశారు. దీంతో అతడి మంచి మనసును మెచ్చి.. ఏకంగా 5157 దిర్హామ్(రూ. లక్ష) గిఫ్ట్‌తో పాటు అతడి ఫ్యామిలీకి దుబాయి ట్రిప్‌ను ఆఫర్ చేశాడు. ఈ సందర్భంగా నౌషద్ మాట్లాడుతూ మనకు దేవుడు ఇచ్చిన దానిలో ఎంతో కొంత పేదలకు పంచిపెడితే అల్లా మనల్ని కరుణిస్తాడని తెలిపాడు. మనం చనిపోయినప్పుడు మనతో పాటు ఏమీ తీసుకెళ్లలేమని, వచ్చినప్పుడు ఎలాగైతే వచ్చామో.. వెళ్లేటప్పుడు కూడా అలాగే వెళ్లాల్సిందేనని పేర్కొన్నాడు. ఇక తాను వరద బాధితులకు నాలుగు బండిళ్ల బట్టలు పంచిపెట్టానని.. పండగపూట వారి ముఖాల్లో నవ్వులు చూడాలనేదే తన ఆశ అని చెప్పుకొచ్చాడు.