Karnads-Indian-Story-gets-him-Windham-Campbell-Prize

రూ. కోటి గెలుచుకున్న భారతీయుడు.. అంతర్జాతీయ ఖ్యాతి

బెంగళూరు: ప్రముఖ జర్నలిస్టు, రచయిత అయిన రఘు కర్నాడ్‌ తన తొలి పుస్తకంతోనే చరిత్ర సృష్టించారు. ఆయన రాసిన ‘ద ఫార్తెస్ట్ ఫీల్డ్: యాన్ ఇండియన్ స్టోరీ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్’ (సుదూర మైదానం: రెండో ప్రపంచ యుద్ధంలో భారత కథ) పుస్తకానికి ప్రఖ్యాత విండ్‌హామ్-కాంప్‌బెల్ పురస్కారం లభించింది. ఈ పురస్కారంతోపాటు 1,65,000 డాలర్ల (రూ.కోటిపైగా) బహుమతి కూడా లభించింది. ఈ విషయాన్ని లండన్‌లో జరిగిన ఓ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో వెల్లడించారు. అమెరికాలోని యేల్ వర్సిటీ సహకారంతో అందజేసే ఈ పురస్కారానికి అంతర్జాతీయంగా చాలా ప్రాధాన్యం ఉంది. ఈ  అరుదైన గౌరవం లభించిన రెండో భారతీయుడిగా రఘు నిలిచారు. భారతీయ వర్ధమాన రచయితల్లో రఘు శైలీ చాలా కొత్తగా ఉందని, అతనికి ఈ అవార్డు రావడం చాలా సంతోషం కలుగజేస్తోందని హార్పర్‌కోలిన్స్ ఇండియా పబ్లికేషన్స్‌కు చెందిన ఎడిటర్ కార్తీకా అన్నారు. ద ఫార్తెస్ట్ ఫీల్డ్ పుస్తకాన్ని ఎడిట్ చేసింది ఆమే. రెండో ప్రపంచ యుద్ధం గురించి మనకు తెలియని ఎన్నో విషయాలను రఘు తన పుస్తకంలో పొందుపరిచారని ఆమె కొనియాడారు.