Jeff-Bezos-Donated-Money-He-Makes-In-3-Mins-To-Australia

ఆస్ట్రేలియాకు విరాళమిచ్చిన జెఫ్ బెజోస్.. మండిపడుతున్న నెటిజన్లు

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాను దావానలం దహించివేస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో రోజురోజుకూ కార్చిచ్చు రాజుకుంటూ పోతోంది తప్ప ఆరడం లేదు. మంటల కారణంగా ఇప్పటికే వేలాది ఇళ్లు అగ్నికి ఆహుతవడంతో తలదాచుకోవడానికి ప్రజలు బీచ్‌లకు వెళ్లాల్సి వస్తోంది. కార్చిచ్చు కారణంగా ఆస్ట్రేలియా వ్యాప్తంగా 48 కోట్ల జంతువులు చనిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. కొన్ని జంతువులు అగ్ని నుంచి తప్పించుకున్నప్పటికీ.. ఆకలితో చనిపోతున్నాయి. ఈ జంతువుల ప్రాణాలను కాపాడటం కోసం అధికారులు హెలికాప్టర్ల నుంచి వివిధ రకాల ఆహారాన్ని అడవుల్లోకి విసురుతున్నారు.  

ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియాను ఆదుకోవడానికి ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు తదితరులు ముందుకొస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ సీఈఓ జెఫ్‌బెజోస్ సైతం ఆస్ట్రేలియాకు విరాళం ప్రకటించారు. ఆస్ట్రేలియాలోని పరిస్థితులను చూస్తే గుండె తరుక్కుపోతుందని.. అమెజాన్ తరపున తాము పది లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల(6 లక్షల 90 వేల అమెరికన్ డాలర్లు)ను విరాళంగా ఇస్తున్నట్టు జెఫ్ బెజోస్ ఇన్‌స్టాగ్రమ్ ఖాతాలో పోస్ట్ చేశారు. భారత కరెన్సీలో చెప్పాలంటే.. రూ. 4 కోట్ల 89 లక్షలు. అయితే.. విరాళమిచ్చిన జెఫ్‌బెజోస్‌పై ప్రశంసలకు బదులు విమర్శలు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడివై ఉండి.. కేవలం పది లక్షల డాలర్లేనా విరాళమిచ్చేదంటూ జెఫ్‌బెజోస్‌పై పలువురు విమర్శలు చేస్తున్నారు. జెఫ్‌బెజోస్ ఇచ్చిన విరాళాన్ని ఆయన 3 నిమిషాల్లో సంపాదించేస్తారని ప్రముఖ రచయిత పీటర్ దావో తప్పుపట్టారు. తాను తన నగ్నచిత్రాలు ఆన్‌లైన్‌లో అమ్ముకుని జెఫ్ బెజోస్ ఇచ్చిన విరాళానికి డబుల్ అమౌంట్ ఇచ్చానంటూ ఓ మహిళ కామెంట్ చేసింది. 

ప్రపంచంలో అనేకమంది వ్యాపారవేత్తలు, సింగర్లు తదితరులు అమెజాన్ సీఈఓ జెఫ్‌బెజోస్ కంటే ఎక్కువ విరాళమిచ్చారంటూ నెటిజన్లు దాతల వివరాలతో ఫొటోలు పెడుతున్నారు. జెఫ్ బెజోస్ తన ఆస్తిలో 0.000059 శాతం మొత్తాన్ని విరాళంగా ఇచ్చి పరువు పోగొట్టుకున్నారని ట్విటర్‌లో పలువురు ట్వీట్లు చేస్తున్నారు. జెఫ్‌బెజోస్‌తో పోల్చుకుంటే చాలా తక్కువ ఆస్తి కలిగిన వారు కూడా తమ సామర్థ్యానికి మించి సహాయం చేశారని వారు గుర్తుచేశారు.