Japan-Coast-Guard-Ship-Echigo-arrives-in-Chennai

భారత్‌ చేరిన ‘ఎచిగో’ యుద్ధనౌక

 

  • ఘన స్వాగతం పలికిన కోస్ట్‌గార్డ్ ఉన్నతాధికారులు, విద్యార్థులు
  • 16న ఉమ్మడి విన్యాసాలు  
భారత సముద్రతీర భద్రతాదళంతో కలిసి ఉమ్మడి యుద్ధవిన్యాసాలు నిర్వహించేందుకు జపాన్‌ నుంచి వచ్చిన ‘ఎచిగో’ యుద్ధనౌకకు కోస్ట్‌గార్డ్‌ ఉన్నతాధికారులు, విద్యార్థులు సోమవారం అపూర్వ స్వాగతం పలికారు. ‘సహోగ్‌-కూజిన్‌’ పేరుతో ఈనెల 16న బంగాళాఖాతంలో ఉమ్మడి యుద్ధ విన్యాసాలు జరుగనున్నాయి. ఈ నౌకతో పాటు భారత సముద్రతీర భద్రతాదళానికి చెందిన నాలుగు నౌకలు, విమానాలు, ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి.
 
చెన్నై(ఆంధ్రజ్యోతి): భారత సముద్రతీర భద్రతాదళంతో కలిసి ఉమ్మడి యుద్ధవిన్యాసాలు నిర్వహించే నిమిత్తం సోమవారం ఉదయం జపాన్‌ నుంచి వచ్చిన ‘ఎచిగో’ యుద్ధనౌకకు కోస్ట్‌గార్డ్‌ ఉన్నతాధికారులు, పాఠశాలల విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు. 2006లో ఉమ్మడిగా యుద్ధ విన్యాసాలు నిర్వహించేందుకు అనువుగా రెండు దేశాలకు చెందిన సముద్రతీర భద్రతదళాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఆ మేరకు ‘సహోగ్‌-కూజిన్‌’ పేరుతో ఈనెల 16న బంగాళాఖాతంలో ఉమ్మడి యుద్ధ విన్యాసాలు జరుగనున్నాయి.
 
ఐదు రోజల సద్భావనా పర్యటనలో భాగంగా వచ్చిన జపాన్‌ కోస్ట్‌గార్డ్‌ నౌక ఎచిగోతోపాటు భారత సముద్రతీర భద్రతాదళానికి చెందిన నాలుగు నౌకలు, విమానాలు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎస్‌ఐఓటి) నుండి వచ్చిన మరో నౌక ఈ విన్యాసాలలో పాల్గొంటాయి. సోమవారం ఉదయం చెన్నై తీరానికి విచ్చేసిన జపాన్‌ కోస్ట్‌గార్డ్‌ నౌక ‘ఎచిగో’కు నగరంలోని పాఠశాలలకు చెందిన విద్యార్థులు, భారత సముద్రతీర భద్రతాదళం పేటీఎం డైరక్టర్‌ జనరల్‌ కృష్ణస్వామినటరాజన్‌ ఇతర అధికారులు ఘనస్వాగతం పలికారు. చెన్నై తీరానికి చేరిన ఆ నౌక వైపు పాఠశాల విద్యార్థినులు జాతీయె చెండాలను చేతపట్టుకుని ఊపుతూ ఘనస్వాగతం పలికారు.
 
జపాన్‌ కోస్ట్‌గార్డ్‌ కమాండెంట్‌ అడ్మిరల్‌ తకాహికో ఒకుషిమా ఇతర అధికారులు, నేవీ సభ్యులు ఆ నౌకలో విచ్చేశారు. ఉమ్మడి విన్యాసాలతోపాటు ఇరు దేశాలకు చెందిన సముద్రతీర భద్రతాదళం సభ్యులకు ప్రత్యేకంగా శిక్షణా శిబిరాలు, సదస్సులు, స్వల్పకాలిక వర్క్‌షాపులు కూడా నిర్వహిస్తారు. సముద్రయానం చేస్తున్నప్పుడు ప్రమాదాలకు గురైనవారిని కాపాడే విధానాలను కూడా ఈ విన్యాసాల సందర్భంగా ప్రదర్శన జరుపుతారు. అదేవిధంగా శత్రుదేశాల నౌకలపై నవీన సాంకేతిక విధానాల ద్వారా దాడి చేసే విధానాలను కూడా ప్రదర్శిస్తారు.