Iran-Protests-Rage-Over-Downed-Jet

శత్రువు అమెరికా కాదు.. ఇరాన్‌ నాయకత్వంపై పౌరుల మండిపాటు

  • ఉక్రెయిన్‌ దుర్ఘటనపై బాధ్యతకు డిమాండ్లు
టెహ్రాన్‌: ఉక్రెయిన్‌ విమానాన్ని క్షిపణితో కూల్చేసిన ఇరాన్‌ నాయకత్వంపై విదేశాల కంటే స్వదేశంలోనే నిరసన జ్వాలలు ఎగిశాయి. తమ క్షిపణే అనుకోకుండా కూల్చేసిందని ఇరాన్‌ తప్పు ఒప్పుకోవడంతో ఇరానియన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయంగా అమాయకులను పొట్టనబెట్టుకున్నారంటూ రివల్యూషనరీ గార్డ్స్‌ పైనా, దేశ రాజకీయ, మత నాయకత్వంపైనా విమర్శల దాడి చేశారు. ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేశారు. అయొతుల్లా ఖమైనీ, రౌహానీ సహా రాజకీయ నాయకత్వం విఫలమైందని దుమ్మెత్తిపోశారు.
 
‘‘శత్రువు అమెరికా కాదు. మీరే. ఏకంగా 176 మందిని దారుణంగా చంపేశారు. ఎవరు దీనికి బాధ్యులు? తక్షణం వైదొలగండి’’ అని ఆజాదీ స్వ్కేర్‌లో గుమిగూడిన వందలమంది ప్రజలు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. మతనేతలంతా గద్దె దిగాలని నినాదాలు చేస్తూ టెహ్రాన్‌, ఇస్ఫహాన్‌ ల్లోని విశ్వవిద్యాలయ విద్యార్థులు ధర్నాలు చేశారు. ఆజాదీ స్క్వేర్‌లో వందల కొద్దీ పోలీసులు బాష్పవాయుగోళాలు, లాఠీచార్జిలతో ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఒక్క పౌరుడిపై కూడా కాల్పులు జరగరాదని ఖమినౌ సహా ప్రభుత్వ నేతలు ఆదేశించడంతో పోలీసులు కేవలం ఓ రక్షణ వలయంగా నిలబడి ఆందోళనకారులు ర్యాలీలు తీయకుండా ఆపారు తప్ప తూటాలకు పనిచెప్పలేదు. ఇరాన్‌ పరిణామాలపై అనేక వీడియోలు పశ్చిమదేశాలకు అందుతున్నాయి. సోషల్‌ మీడియా పోస్టుల్లోనూ ఇరానియన్లు తమ దేశ వైఖరిని తూర్పారబడుతున్నారు.