International-Day-for-Biological-Diversity

నేడు అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం

‘గ్లోబల్‌ అసెస్‌మెంట్‌ నివేదిక–2019’లో తేలిన కీలకమైన అంశం ఏమిటంటే మూలవాసులు నివసిస్తున్నచోట జీవవైవిధ్య క్షీణత తక్కువరేటులో ఉంటున్నది. ప్రకృతితో సహజీవనం చేస్తూ, తమ జీవికకు అవసరమైన మేరకే వనరులను వినియోగించుకుంటూ, వాటిని పునఃసృష్టించే నైపుణ్యం, జ్ఞానం వారిలోనే అధికంగా ఉన్నాయని ఈ నివేదిక పేర్కొన్నది.


మానవ మనుగడకు జీవవైవిధ్యం అత్యంతావశ్యకం. జీవవైవిధ్యం మన మనుగడకు దోహదకారిగా ఉన్నట్లే, జీవవైవిధ్య సమతుల్యతకు మన జీవన విధానం కూడా దోహదం చేస్తుంది. దీన్ని మరింత ప్రభావవంతంగా, ఆచరణపూర్వకంగా అర్థం చేయించడం కోసమే ‘మన జీవవైవిధ్యం, మన ఆహారం, మన ఆరోగ్యం’ ఇతివృత్తంగా నేడు ‘అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం’ నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచదేశాలకు పిలుపునిచ్చింది. మానవ భవిష్యత్తుకు జీవవైవిధ్యాన్ని కాపాడుకోవలసిన అవసరాన్ని తెలియజెప్తూ 2012లో బ్రెజిల్‌లోని రియో డిజనీరోలో జరిగిన సదస్సు తీర్మానం చేసింది. సుస్థిరాభివృద్ధికోసం దారిద్య్ర రహితం, చక్కని ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, భూతల జీవనం, జలాంతర జీవనం, వాతావరణ చర్యల సాధనకు సభ్యదేశాల ప్రభుత్వాలు, సేవాసంస్థలు, పౌరసమాజం యుద్ధప్రాతిపదికన ప్రచారం కార్యాచరణ చేబట్టాలని పిలుపినిచ్చింది. విశ్వంలో మానవ మనుగడకు ఆధారభూతమైన ఒకేఒక భూగ్రహాన్ని కాపాడు కోవడం కోసం ప్రతి పౌరుడు నైతిక బాధ్యతతో పనిచేయాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఒక సంక్లిష్ట, సందిగ్ధ కాలంలో నివసిస్తున్నారు. ప్రజలు శ్రేయస్సును మరిచి వ్యక్తిగత విశ్వాసాలను రెచ్చగొట్టి అధికారం దక్కించుకుంటున్న రాజకీయాలు, వెర్రితలలు వేస్తున్న మతోన్మాదం, అగ్రరాజ్యాల ఆక్రమిత విస్తరణ విధానాలతో పాటు వేగంగా క్షీణిస్తున్న పర్యావరణం వంటి దుష్ఫలితాలను ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం అనుభవిస్తున్నది.
 
ఋతువులు గతి తప్పుతున్నాయి. జీవనదులు ఎండిపోతున్నాయి. వృక్ష,జంతు జాతులు విలుప్త స్థితికి చేరుతున్నాయి. భూ అవిర్భావం తర్వాత జీవులు అంతరించడానికి సంబంధించి ఆరవ మహావిపత్తును ఎదుర్కొంటున్నది. మన మనుగడకు ఆధారభూతమైన సహజ ఆవరణ వ్యవస్థ ప్రమాదంలో పడుతున్నది. భూగ్రహంపై కనిపించే సమస్త జీవజాలం ఒకేసారి ఏర్పడింది కాదు. భూమి ఆవిర్భవించాక నాలుగు బిలియన్‌ సంవత్సరాలకు జన్యుపదార్థం ద్విగుణీకృతం చెంది అకశేరుకాలు, చేపలు, ఉభయజీవులు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాల వంటి సకశేరుకాలతో పాటు పుష్పించే మొక్కలు కూడా ఏర్పడినాయి. క్రమంగా వైవిధ్యం ఉన్న జీవ రూపాలు ఏర్పడ్డాయి. అత్యంత శీతలంగా ఉండే ధృవప్రాంతాలకు, అధిక ఊష్ణోగ్రతలు ఉండే ఎడారులకు, సముద్రపు లోతులకు, పర్వత శిఖరాగ్రాలకు వృక్ష, జంతుజాలాలు విస్తరించాయి.
 
నేలపై, నీటిలోని ఆవరణ వ్యవస్థలలో నివసిస్తున్న జీవరాశులు వాటిమధ్యన గల విభిన్నతలనే జీవవైవిధ్యంగా పిలుస్తారు. జీవవైవిధ్యం జాతీయ సంపదకు సూచిక వంటిది. మానవ వికాసానికి చోదక శక్తిగా పనిచేస్తుంది. జీవ వైవిధ్యాన్ని సంరక్షించడమంటే ఉత్పాదక, వినియోగ, ఆహ్లాద, సాంస్కృతిక, నైతిక విలువలను సాగు చేయడం వంటిది. ఇది ఎలాగంటే.. భూమిపై ఆహారపు పంటలు, ఫలాలు, ఔషధాలు ఇచ్చే డెబ్బై శాతం మొక్కలకు కీటకాలు, పక్షులు పరాగ సంపర్క సహకారులుగా ఉంటాయి. మానవ చర్యలతో పారిశ్రామిక దుష్ఫలితాలతో అనేక కీటక, పక్షిజాతులు అంతర్థానం అవుతున్నాయి. ప్రతియేటా కీటక జనాభాలో 2.5 శాతం క్షీణత కలుగుతున్నది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల పంటల దిగుబడి తగ్గిందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత ప్రమాదపుటంచులకు చేరింది. కీటక, పక్షి జాతులు తగ్గడం వలన హానికర, వ్యాధికర జీవులు ప్రబలి అటవీ సంపద వేగంగా క్షీణిస్తున్నది. ఇదే విధంగా మొక్కలు నేలలోని నీటిని వాతావరణానికి చేర్చి జలచక్ర నిరంతరతకు పాటు పడుతాయి. అంతేకాదు రాతిని మట్టి రేణువులుగా మారుస్తాయి.
 
జీవవైవిధ్యం విస్తరణ, క్షీణత ప్రకృతి సహజంగా జరిగే ప్రక్రియ. వివేచన, తెలివిగల మానవుడు ఆవిర్భవించిన నాటినుండి జీవవైవిధ్యత క్షీణత రేటు అసాధారణంగా పెరిగింది. జనాభా విస్ఫోటనం, మరణాల రేటు తగ్గుదల, వనరుల వినియోగంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. పారిశ్రామికీకరణ, ఆకాశహర్మ్యాల నిర్మాణం, ఖనిజాలు, గ్రానైట్‌ కోసం పర్వతాలు, గుట్టలను తవ్వడం, అడవులు తగ్గడం వంటి చర్యలతో అసంఖ్యాక జంతు, వృక్షజాతులు విలుప్తమవుతున్నాయి. కార్బన్‌ డై ఆక్సైడ్‌, మిథేన్‌ విడుదల పెరుగుతూ భూతాపానికి కారణమవుతున్నాయి. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్లకు పైగా ప్రజలు వంటచెరుకును వినియోగిస్తున్నారు. తీరప్రాంతపు ఆవాసాలు దెబ్బతినడం వలన హరికేన్లు వంటి తుఫానులు సంభవించి మిలియన్ల కొద్దీ ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారు. ప్లాస్టిక్‌ కాలుష్యం పదిరెట్లు పెరిగింది. పరిశ్రమల నుండి వెలువడే కాలుష్య కారకాల వలన సముద్రంలో రెండులక్షల నలభై అయిదువేల చదరపు కిలోమీటర్ల మేరకు 400 పైగా మృతప్రాంతాలు తయారయ్యాయి. ఇలాంటి పరిణామాలతో జీవజాతులు వెయ్యిరెట్ల వేగంతో క్షీణిస్తున్నాయి. మానవ ఆహారభద్రత, ఆరోగ్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. సుస్థిరాభివృద్ధికోసం శాస్త్రీయ విధానాలను రూపొందించే జీవవైవిధ్య పరిరక్షణ వేదిక ఇటీవల ‘గ్లోబల్‌ అసెస్‌మెంట్‌ నివేదిక–2019’ని విడుదల చేసింది.
 
పదిలక్షలకు పైగా వృక్ష, జంతుజాతులు అంతరించే స్థితికి చేరుకున్నాయని తెలిపింది. రానున్న రెండు దశాబ్దాలలో వేలాదిగా ఇవి అంతర్థానం అవుతాయని తెలిపింది. ఈ నివేదికలోని మరో ఆసక్తికర, కీలకమైన అంశం ఏమిటంటే.. మూలవాసులు నివసిస్తున్నచోట జీవవైవిధ్య క్షీణత తక్కువరేటులో ఉంటున్నదని తెలియజేసింది. ప్రకృతితో సహాజీవనం చేస్తూ తమ జీవికకు అవసరమైన మేరకే వనరులను వినియోగించుకుంటూ వాటిని పునఃసృష్టిస్తూ ఉండే నైపుణ్యాలు, జ్ఞానం మూలవాసులలో అధికంగా ఉందని పేర్కొన్నది. వరల్డ్‌ రిసోర్సెస్‌ ఇనిస్టిట్యూట్‌ నివేదిక.. ఆదిమ వాసులకు అటవీ హక్కులను కట్టబెట్టిన చోట అడవుల నరికివేత తగ్గిందన్న వాస్తవాన్ని తెలియజేసింది. ఈనేపథ్యంలో భారత సుప్రీంకోర్టు అటవీ ప్రాంతాల నుండి ఆదివాసీలు వెళ్ళిపోవాలని ఇచ్చిన తీర్పును పున:సమీక్షించుకోవలసిన అవసరముంది. ప్రపంచంలో 2.3% భూభాగంతో 12% జీవవైవిధ్య జాతులకు నిలయంగా ఉన్న భారత్‌లో కూడా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 60% ఉభయచరాలు, 47% సరీసృపాలు ప్రమాదపుటంచునకు చేరుకున్నాయి. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం మానవులందరి సమిష్టి బాధ్యత. దీనిని కాపాడుకుంటూనే అవసరాలను తీర్చుకోవాలి. జీవ వైవిధ్యతను సంరక్షించడం కోసం ప్రభుత్వాలు అత్యుత్తమమైన చర్యలను వెంటనే చేపట్టాలి. ఇటీవల స్వీడన్‌ బాలిక గ్రెటాతంబెర్గ్‌ ‘వాయిస్‌ ఫర్‌ ద ప్లానెట్‌ అండ్‌ ది స్ట్రైక్‌ ఫర్‌ క్లైమేట్‌’ నినాదంతో నిర్వహించిన జీవవైవిధ్య రక్షణ ఉద్యమం ఆదేశంలో పర్యావరణ అనుకూల విధానాలు అమలయ్యేలా చేసింది. గ్రెటాతంబెర్గ్‌, వందనాశివ, మేధాపాట్కర్‌, వనజీవి రామయ్య దారిలో పౌరసమాజం జీవవైవిధ్య రక్షణకోసం ఉద్యమించడమే తక్షణ కర్తవ్యం.
ఆస్నాల శ్రీనివాస్‌
(నేడు అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం)