Indians-Studying-in-US-Increased-by-3-Percent

ఏటేటా పెరుగుతున్న యూఎస్‌లో చదువుకునే భారతీయ విద్యార్థులు

2018-19లో 2,02,014కు చేరిన సంఖ్య

ఓపెన్‌ డోర్స్‌- 2019 నివేదిక వెల్లడి
త్వరలో హైదరాబాద్‌లో ‘ఎడుక్యేషన్‌-యూఎస్‌ఏ’ కేంద్రం

న్యూఢిల్లీ: అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలన్నది ఎందరో భారతీయ విద్యార్థుల కల. ఆ కలను సాకారం చేసుకుంటున్నవారు ఏటేటా పెరుగుతున్నారు. అమెరికాలో చదువుకునే మనవాళ్ల సంఖ్య వరుసగా ఆరో ఏడాదీ పెరిగిందని ‘ఓపెన్‌డోర్స్‌ నివేదిక-2019’ వెల్లడించింది. ‘‘2018-19 విద్యా సంవత్సరంలో అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు సృష్టించింది. వీరిలో భారతీయ విద్యార్థుల సంఖ్య 3 శాతం పెరిగింది’’ అని నివేదిక వివరించింది. అమెరికాలోని ప్రతి ఐదుగురు అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒకరు భారత్‌కు చెందినవారేనని తెలిపింది. ఆ నివేదిక ప్రకారం... అమెరికాలోని కళాశాలలు, యూనివర్సిటీల్లో 2,02,014 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. 3,69,548 మంది విద్యార్థులతో చైనా వరుసగా పదో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానం భారత్‌కు దక్కింది. 

అమెరికాలో మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 10,95,299గా ఉండగా వారిలో 50ు మంది భారత్‌, చైనాకు చెందినవారే. గత ఏడాదితో పోలిస్తే మొత్తం విద్యార్థుల సంఖ్యలో 0.05 శాతం పెరుగుదల నమోదయింది. విదేశీ విద్యార్థుల ద్వారా అమెరికాకు ఏటా రూ.32,11,390 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఈ నివేదికను ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలోని మినిస్టర్‌ కౌన్సిలర్‌ సి.ఫిలిప్స్‌ విడుదల చేశారు. ‘‘భారత్‌లో ‘ఎడుక్యేషన్‌-యూఎస్‌ఏ’ కేంద్రాలు ఉన్నాయి. ఎనిమిదో కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించనున్నామ’’ని ఆయన వెల్లడించారు. అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఈ కేంద్రాల్లో ఉండే సలహాదారులు సహాయపడతారని తెలిపారు. వారు చదవాలనుకునే కోర్సు ఏ కాలేజీలో ఉంది, ఎంత ఖర్చవుతుంది నుంచి దరఖాస్తు చేయడం వరకు తోడ్పాటు అందిస్తారని వివరించారు. ‘‘ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ ఇండియా’ అనే మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా సమాచారం అందిస్తున్నాం. ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌లో కూడా ఈ యాప్‌ లభ్యమవుతోంది’’ అని తెలిపారు. అంతర్జాతీయ విద్యార్థులకు అమెరికా ఆహ్వానం పలుకుతోందని చెప్పారు.