Indian-Woman-Suffering-from-Rare-Disease-Fights-to-stay-in-UK

భారతీయ యువతికి అరుదైన వ్యాధి.. బహిష్కరిస్తామంటున్న యూకే

 లండన్: ఉన్నత చదువుల కోసమని దేశం కాని దేశం వెళ్లిన భారత్‌కు చెందిన ఓ యువతి అరుదైన వ్యాధి బారిన పడింది. ఆ వ్యాధికి సరియైన చికిత్స ఇండియాలో లేకపోవడం, దాంతో ఆ దేశంలోనే ఉండాల్సి వచ్చింది. కానీ, స్టూడెంట్ వీసాపై వెళ్లిన సదరు యువతికి ఓ సమస్య వచ్చి పడింది. ఆ వీసా గడువు ముగియడంతో వెంటనే దేశం విడిచి వెళ్లాలని అక్కడి అధికారులు చెబుతున్నారు. లేకపోతే బలవంతంగా దేశం నుంచి బహిష్కరిస్తామని యూకే అధికారులు తేల్చి చెప్పారు. అయితే, ఆ వ్యాధికి సరియైన చికిత్స భారత్‌లో లేకపోవడంతో తాను దేశం విడిచి వెళ్లాలేనని బాధితురాలు అధికారులతో మొరపెట్టుకుంటుంది.

వివరాల్లోకి వెళితే... ఇండియాకు చెందిన భవాని ఈస్పతి అనే యువతి ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లింది. అక్కడికి వెళ్లిన తరువాత కొన్ని రోజులకు ఆమెకు అరుదైన వ్యాధి(జీర్ణ వాహిక రుగ్మత) ఉన్నట్లు తేలింది. ఈ వ్యాధికి భారత్‌లో సరియైన చికిత్స అందుబాటులో లేదు. దాంతో తాను బతకాలంటే బ్రిటన్‌లోనే ఉండాలని, వేరే మార్గం లేదంటూ తననకు అక్కడే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని భవాని, ఆమెకు కాబోయే భర్త మార్టిన్ మాంగ్లెర్‌తో కలిసి గతేడాది డిసెంబర్‌లో అక్కడి అధికారులకు ఆన్‌లైన్‌లో ఆప్లికేషన్ పెట్టుకుంది.  ఈ క్రమంలో ఆమెకు సోకిన వ్యాధికి చికిత్స చేసే క్రమంలో  ఓ ఆపరేషన్ చేయగా భవాని కొమాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా అంత బాగోలేదని,  ప్రయాణం చేయడం ఆమె ప్రాణానికే ముప్పు అని భవానికి చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. అంతేగాక భవానికి గత నెలలో  ప్రేగు సంబంధించిన ఆపరేషన్ జరిగినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో కూడా మరో ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భవాని ఆరోగ్యం దృష్ట్యా బ్రిటన్‌లోనే ఉండనిచ్చి కావాల్సిన చికిత్సకు సహకరించాల్సిందిగా ప్రవాస సంక్షేమ కౌన్సిల్ లిగల్ డైరెక్టర్ చాయ్ పటేల్ అన్నారు.