Indian-students-will-release-in-3-weeks,-said-American-Telugu-Association-President

‘ఫార్మింగ్‌టన్‌’ విద్యార్థులకు..మూడు వారాల్లో విముక్తి

‘ఆంధ్రజ్యోతి’తో ‘ఆటా’ అధ్యక్షుడు భువనేశ్‌ బూజల 

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఫార్మింగ్‌టన్‌ నకిలీ విశ్వవిద్యాలయం కేసులో అమెరికాలో అరెస్టయిన తెలుగు విద్యార్థులందరూ మరో మూడు వారాల్లో విడుదలయ్యే అవకాశాలున్నాయని అమెరికా-తెలుగు అసోసియేషన్‌ (ఆటా) అధ్యక్షుడు భువనేశ్‌ బూజల అన్నారు. ఇప్పటికే 20 మంది విద్యార్థులు అక్కడి జైళ్ల నుంచి విముక్తి పొందారని, మిగిలిన 109 మంది విడుదలకు అక్కడి అధికారులతో తెలుగు సంఘాలన్నీ చర్చలు జరుపుతున్నాయన్నారు. ‘నీరు, వ్యర్థాల నిర్వహణ’పై మంగళవారం హెచ్‌ఐసీసీలో ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సుకు హాజరైన ఆయన.. ఫార్మింగ్‌టన్‌ నకిలీ విశ్వవిద్యాలయం వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. మోసంతో అమెరికాలో అడుగుపెట్టి కనీసం 180 రోజులు ఉన్నవారు కనీసం మూడేళ్ల వరకు అమెరికాకు రాకుండా ట్రంప్‌ ప్రభుత్వం గత ఏడాది నిషేధం విధించిందని గుర్తుచేశారు. అమెరికాకు వచ్చే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విద్యార్థులను కోరారు. ఈ ఘటనను విద్యార్థులు, రాష్ట్ర ప్రభుత్వం ఒక గుణపాఠంగా తీసుకోవాలని కోరారు. వాస్తవానికి అమెరికాకు వెళ్తున్నవారి వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉండటం లేదని, దీనివల్ల ఇలాంటి సంఘటనలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడం లేదన్నారు. ఇలాంటి మోసాలు భవిష్యత్తులో జరగకుండా ఎన్నారై వ్యవహారాల శాఖ క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు.