Indian-Student-Sentenced-To-1-Year-In-Prison-For-Damaging-Computers-In-New-York-University

అమెరికాలో తెలుగు విద్యార్థికి ఏడాది జైలు శిక్ష, రూ. 40 లక్షల జరిమానా.. ఏం చేశాడో తెలిస్తే..

వాషింగ్టన్: అమెరికాలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి చేసిన నేరానికి కోర్టు ఏడాది జైలుశిక్షను విధించింది. ఆకుతోట విశ్వనాథ్(27) అనే ఎన్నారై విద్యార్థి తాను చదువుకుంటున్న కాలేజీలోని కంప్యూటర్లను ఉద్దేశపూర్వకంగా నాశనం చేశాడు. విశ్వనాథ్ ఫిబ్రవరిలో ఈ ఘటనకు పాల్పడ్డాడు. కాలేజీలోని కంప్యూటర్ల యూఎస్‌బీ పోర్ట్‌లలో యూఎస్‌బీ కిల్లర్ డివైజ్‌ను పెట్టిన విశ్వానాథ్.. కంప్యూటర్లలోకి అనేక వైరస్, ఇతర కమాండ్లను పంపాడు. దీనిద్వారా ఎలక్ట్రికల్ సిస్టమ్ మొత్తం దెబ్బతింది. అంతే కాకుండా యూఎస్‌బీ పోర్ట్‌లు ఇక పనిచేయకుండా పాడు చేశాడు.

ఫిబ్రవరి నుంచి ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతూ రాగా.. విశ్వానాథ్ తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. దీంతో కోర్టు ఏడాది జైలుశిక్ష, మరో ఏడాది పోలీసుల పర్యవేక్షణ ఉంటుందని తీర్పునిచ్చింది. అదేవిధంగా కంప్యూటర్లను పాడుచేసినందుకు గాను కాలేజీ యాజమాన్యానికి 58,471 డాలర్లు(రూ. 41 లక్షల 69 వేలు) జరిమానా చెల్లించాలని తెలిపింది. కాగా, విశ్వానాథ్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాడు. ఎఫ్ 1 స్టూడెంట్ వీసాపై అల్బానీలోని సెయింట్ రోజ్ కాలేజీలో మాస్టర్స్ చేస్తున్నాడు.