Indian-Origin-Woman-gets-Life-Sentenced

న్యూయార్క్‌లో భారతీయ మహిళకు జీవితఖైదు.. చేసిన తప్పేంటంటే..

న్యూయార్క్‌: అభంశుభం తెలియని తొమ్మిదేళ్ల బాలికను గొంతు నులిమి చంపేసిందో సవతి తల్లి. బాలిక తల్లిస్థానంలో వచ్చిన ఆమె ఈ దారుణానికి పాల్పడింది. ఈ నేరానికి గాను భారతీయ మహిళకు న్యూయార్క్‌లోని క్వీన్స్ న్యాయస్థానం జీవితఖైదు విధించింది. పోలీసుల కథనం మేరకు... క్వీన్స్‌లో  ఉండే షామ్ దాయి అర్జు(55) అనే మహిళ అక్కడే రెస్టారెంట్‌లో పనిచేసే ఓ వ్యక్తిని వివాహమాడింది. అయితే, ఆయనకు అప్పటికే పెళ్లై తొమ్మిదేళ్ల కూతురు ఉంది. బాలికను తన సొంత కూతురులా చూసుకుంటానని, ఆమెకు ఏ లోటు రానియని చెప్పడంతో ఆ వ్యక్తి ఈమెను నమ్మి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొత్తలో చిన్నారిని బాగానే చూసుకుంది. దాంతో భర్త ఆమెను పూర్తిగా నమ్మేశాడు. తన కూతురుకు ఇక అమ్మలేని లోటు తీరిపోయిందని సంతోష పడ్డాడు. కానీ, ఆ తరువాత ఆమె తన అసలు రూపం బయటపెట్టింది. భర్త ఇంటి నుంచి బయట వెళ్లగానే చిన్నారిని హింసించడం చేసేది. అలా కొన్ని రోజుల తర్వాత ఆ హింస మరింత పెరిగిపోయింది. బాలికను ఇంట్లో జరిగిన విషయాలు తండ్రితో చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆమె మౌనంగానే ఉండేది.

ఇదే అదునుగా భావించిన ఆ కసాయి తల్లి చిన్నారి అడ్డుతొలగించుకోవాలని పథకం వేసింది. ఒకరోజు స్నానం చేయిస్తానని చెప్పి బాత్‌రూంలోకి తీసుకెళ్లి చేయిచేసుకుంది. ఆ తర్వాత గొంతునులమి చంపేసింది. అయితే, పక్కనే ఉండే ఓ మహిళ అదే రోజు షామ్ దాయి ఇంటికి వెళ్లింది. మీ పాప కనిపించడం లేదు.. ఎక్కడికి వెళ్లిందని ఆమెను అడిగింది. దాంతో అర్జు మొదట తడబడింది. ఆ తరువాత బాత్‌రూంలో స్నానం చేస్తుందని బుకాయించింది. ఎంతసేపటికి చిన్నారి బయటకు రాకపోవడంతో అనుమానించిన మహిళ బాలిక తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. దాంతో ఇంటికి వచ్చిన అతడు బాత్‌రూం డోర్ పగలగొట్టి చూడగా చిన్నారి విగతజీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. దాంతో న్యాయస్థానంలో హాజరుపరచగా నిందితురాలికి జీవితఖైదు పడింది.