Indian-origin-man-who-drowned-his-wife-in-bathtub-convicted-in-US

భార్యను హతమార్చిన ఎన్నారైకు అమెరికాలో జైలుశిక్ష

అరిజోనా: భార్యను హతమార్చిన ఎన్నారై భర్తను 12 ఏళ్ల తర్వాత అమెరికా కోర్టు దోషిగా తేల్చింది. వివరాల్లోకి వెళ్తే.. అవతార్ గ్రెవాల్(44), నవ్‌నీత్ కౌర్‌కు 2005లో భారతదేశంలోనే వివాహం జరిగింది. వివాహం అనంతరం గ్రెవాల్ కెనడాలో స్థిరపడగా.. నవ్‌నీత్ కౌర్ వీసాపై అమెరికా వెళ్లింది. నవనీత్ కౌర్‌కు హార్ట్ సర్జరీ చేయించాల్సి ఉండటంతో.. ఆమె అమెరికాలోనే ఉండాల్సి వచ్చింది. అయితే గ్రెవాల్ మాత్రం ఆమెను కెనడా రావాల్సిందిగా ఇబ్బంది పెడుతూ వచ్చాడు. ఆమె ఫోన్ తీయకపోతే.. ఆమె ఆఫీసుకు ఫోన్ చేయడం, ఆమె గురించి వేరేవాళ్లను అడగటం చేస్తూ వచ్చాడు. పెళ్లైన కొద్ది రోజుల్లోనే గ్రెవాల్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడని లాయర్లు కోర్టుకు తెలిపారు. గ్రెవాల్‌తో తాను కలిసి జీవించలేనని నిర్ణయించుకున్న నవనీత్ కౌర్ 2007లో గ్రెవాల్ నుంచి విడాకులను కోరింది. గ్రెవాల్ కూడా విడాకులకు అంగీకరించాడు. అలా ఒక రోజున కెనాడా నుంచి నవనీత్ నివసిస్తున్న అరిజోనాకు వచ్చిన గ్రెవాల్‌ను నవనీత్ తన ఇంటికి తీసుకెళ్లింది. వారిద్దరి మధ్య ఘర్షణ జరగడంతో.. అనుకోకుండా గ్రెవాల్ ఆమెను గొంతుకోసి హతమార్చాడు. అనంతరం ఆమె శవాన్ని బాత్‌టబ్‌లో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. 2007లో భారత్‌కు వచ్చేసిన గ్రెవాల్‌ తిరిగి 2011లో కెనడాకు వెళ్లగా అధికారులు అతడిని అరెస్ట్ చేసి అమెరికా అధికారులకు అప్పగించారు. అలా అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతూ వస్తుండగా.. సోమవారం ఈ కేసులో గ్రెవాల్‌ను కోర్టు దోషిగా తేల్చింది. ఆగస్టు 23న గ్రెవాల్‌కు జైలు శిక్షను విధించనుంది.

Related Articles