Indian-origin-man-arrested-for-killing-father-in-Philadelphia

అమెరికాలో ఘోరం.. 60 ఏళ్ల తండ్రిని కాల్చి చంపిన ఎన్నారై

న్యూయార్క్: అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన ఓ ఎన్నారై దారుణానికి ఒడిగట్టాడు. కన్నతండ్రినే తుపాకీతో కాల్చిపారేశాడు. స్కిజోఫ్రెనియా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్న సోహన్ పంజ్రోలియా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 60 ఏళ్ల మహేంద్ర పంజ్రోలియాను హత్య చేసిన తర్వాత ఇంట్లోని కారులో అతను పరారయ్యాడు. హత్యకు ఉపయోగించిన తుపాకీతో అతను మసాచుసెట్స్ వైపు పారిపోయాడు. దీంతో ఈ ప్రాంతంలో ఉంటున్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఇక్కడి హార్వర్డ్ యూనివర్సిటీ హెచ్చరించింది. సోహన్ కూడా హార్వర్డ్ వర్సిటీకి చెందిన ఓ కాలేజిలోనే చదువుకున్నట్లు సమాచారం. 

సోహన్ పారిపోయిన కారు మసాచుసెట్స్‌లోని ఓ ఐస్‌క్రీం పార్లర్ వద్ద ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అంతే హుటాహుటిన వారు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు అక్కడకు వస్తారని ఊహించని సోహన్.. వారి చేతికి సులువుగా దొరికిపోయాడు. అతన్ని అరెస్టు చేసి, ఫిలడెల్ఫియాకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడకు చేరుకున్న తర్వాత హత్య కేసులో అతను విచారణ ఎదర్కోవాల్సి ఉంటుందని చెప్పారు.