INDIAN-ORIGIN-EX-POLICEMAN-JAILED-FOR-SEXUAL-OFFENCES-WITH-UNDERAGE-GIRLS

మైనర్ బాలికల జీవితాలతో చెలగాటమాడావ్.. ఎన్నారైని నిలదీసిన న్యాయమూర్తి

సింగపూర్: ఎంతో మంది యువతుల జీవితాలతో చెలగాటమాడిన అరుణ్ ప్రశాంత్(25) అనే ఎన్నారైకు సింగపూరు కోర్టు రెండేళ్ల జైలుశిక్షను విధించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అరుణ్ గతంలో సింగపూర్ పోలీస్ ఫోర్స్‌లో పనిచేసేవాడు. ఆ సమయంలో పదుల సంఖ్యలో యువతులను లైంగికంగా వేధిస్తూ వచ్చాడు. అరుణ్ తమపై లైంగికంగా దాడి చేశాడంటూ మైనర్ బాలికలు సైతం కోర్టుకు వచ్చి సాక్ష్యం తెలిపారు. 2016 ఫిబ్రవరి సమయంలో సోషల్ మీడియా ద్వారా అరుణ్ తనతో పరిచయం పెంచుకున్నాడని, అలా చివరకు తనపై లైంగికంగా దాడి చేసినట్టు ఓ మైనర్ బాలిక పేర్కొంది. 

అంతేకాకుండా అశ్లీల చిత్రాలు కావాలంటూ తనను ఇబ్బంది పెట్టేవాడని తెలిపింది. తాను పోలీస్‌గా పనిచేస్తున్నానని బయట కలుద్దాం అంటూ తన ఇంటికి తీసుకెళ్లి తనపై లైంగికంగా దాడి చేశాడని మైనర్ బాలిక కోర్టుకు తెలిపింది. 2017లో మరో బాలికపై అరుణ్ ఇదే రకంగా లైంగిక దాడికి పాల్పడగా.. ఆ బాలిక తన కారు డ్రైవర్ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలా అరుణ్ చేసిన నేరాలన్నీ బయటపడ్డాయి. అరుణ్‌ను ఉద్యోగం నుంచి తీసేసి అధికారులు అరెస్ట్ చేశారు. అరుణ్ ఫోన్‌లో 720 అశ్లీల ఫొటోలు దొరికినట్టు అధికారులు తెలిపారు. అరుణ్ చేతిలో ఎంతో మంది యువతలు మోసపోయారని.. వారందరూ బయటకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటూ పోలీసులు సూచించగా.. అనేక మంది ముందుకొచ్చారు. పోలీస్ అని చెప్పుకుని అమ్మాయిల జీవితంతో చెలగాటం ఆడటమేంటని జడ్జి సైతం అరుణ్‌ను నిలదీశారు. అందరి వాదనలు విన్న జడ్జి అరుణ్‌కు రెండేళ్ల జైలు శిక్షను విధించారు. సహజంగా మైనర్‌ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తులకు సింగపూర్ చట్టాల ప్రకారం దాదాపు పదేళ్ల శిక్ష, జరిమానాను విధిస్తారు. అరుణ్ మొదటిసారి ఇలా చేయడం వల్ల రెండేళ్ల శిక్షను విధించినట్టు తెలుస్తోంది.