Indian-Man-Come-back-Who-allegedly-Held-by-Saudi-Employer-from-3-Years

సౌదీలో మూడేళ్లుగా నరకం.. యజమాని వేధింపులు.. సీఎం జోక్యంతో..

రాంచీ: ఎన్నో ఆశలతో సౌదీ వెళ్లిన జార్ఖండ్ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. ఏడాది కాంట్రాక్ట్‌పై పనికి కుదిరిన అతడికి ఆ ఏడాది గడిచిన తరువాత నుంచి అసలు సమస్య మొదలైంది. మరో సంవత్సరం పాటు అక్కడే పనిచేయాలని యజమాని యువకుడ్ని బలవంతంగా బంధించాడు. ఆపై ప్రతిరోజు టార్చర్ చేయడం ప్రారంభించాడు. చివరకు ఎలాగోలా తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు యువకుడు. దాంతో వారు రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్ దాస్‌ను కలిసి తమ కొడుకు పరిస్థితి గురించి వివవరించారు. యువకుడి పరిస్థితి గురించి తెలుసుకుని చలించిపోయిన సీఏం వెంటనే అతడ్ని ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేయమని అధికారులను ఆదేశించారు. దాంతో అధికారులు వెంటనే దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయంను సంప్రదించారు. అధికారుల ప్రయత్నం ఫలించడంతో యువకుడు బక్రీద్ పండగ రోజైన సోమవారం మాతృభూమిపై అడుగుపెట్టాడు. 

వివరాల్లోకి వెళితే... జార్ఖండ్ రాజధాని రాంచీలోని హిందిపిరికి చెందిన మహ్మద్ ముఫిజ్ వృత్తిరీత్యా మెకానిక్. కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలనే ఆశతో  మూడేళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి వద్ద ఏడాది కాంట్రాక్ట్‌పై 2017లో పనికి కుదిరాడు. ఏడాది కాంట్రాక్ట్ ముగియడంతో యజమానిని తనను విడిచిపెట్టాలని అడిగాడు ముఫిజ్. కాని యజమాని మాత్రం ఇంకో ఏడాది పని చేయాలని బలవంతంగా అక్కడే ఉంచాడు. ఆ ఏడాది మొత్తం ముఫిజ్‌కు ఎలాంటి సాలరీ ఇవ్వకపోగా తీవ్రంగా కొట్టడం చేసేవాడు. సరిగ్గా భోజనం కూడా పెట్టకుండా పశువు కంటే హీనంగా చూసేవాడు. అక్కడి నుంచి తప్పించుకోవాలని యువకుడు చాలాసార్లు ప్రత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఇక అతడ్ని ఆపాయింట్ చేసిన సంస్థ ముఫిజ్‌పై దొంగతనం కేసు పెట్టింది. దీంతో తన వాళ్లను మళ్లీ చూస్తాననే ఆశ వదులుకున్నాడు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం ఒకరోజు ముఫిజ్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.  

తనను యజమాని బలవంతంగా బంధించాడని, ఎలాగైనా ఈ నరకం నుంచి కాపాడాలని తల్లిదండ్రులతో చెప్పి కన్నీటి పర్యంతమయ్యాడు. దాంతో అతడి సోదరి ఇష్రత్ పర్వీన్ సీఏం రఘుబర్ దాస్‌ను కలిసి ముఫిజ్ పరిస్థితి గురించి వివరించింది. తన సోదరుడిని దుబాయ్ యజమాని చెర నుంచి కాపాడాలని వేడుకుంది. దీంతో ముఖ్యమంత్రి ముఫిజ్ విషయమై ఓ ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సౌదీలోని ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరిపింది. చివరకు అధికారుల ప్రయత్నం ఫలించడంతో ముఫిజ్‌కు ఎమర్జెన్సీ పాస్‌పోర్ట్ లభించింది. దీంతో అతడు సోమవారం రాంచీ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఇక  ముఫిజ్ రాకకోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న కుటుంబం సభ్యులు అతడు కనబడగానే వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పర్వీన్ విమానాశ్రయంలోనే సోదరుడి చేతికి రాఖీ కట్టింది. అసలు తన వాళ్లను తిరిగి చూస్తానని అనుకోలేదని, తనను స్వదేశానికి రప్పించడంలో కృషి చేసిన అధికారుల బృందానికి ఈ సందర్భంగా ముఫిజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు.