Indian-helps-employee-to-rob-his-businessman-friend

14 ఏళ్ల స్నేహం.. భారతీయుడి సాయంతో.. 34కోట్లకు టోపీ..

దుబాయి: దుబాయి వచ్చి సొంత వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి.. వ్యాపారం లాభాలివ్వడంతో స్వదేశం నుంచి తన మిత్రుడిని సాయం కోసం తెచ్చుకున్నాడు. నెలకు రూ.7లక్షల జీతం ఇస్తున్నాడు. ఇలా 14 ఏళ్లుగా అతని వద్ద పని చేస్తున్న మిత్రుడు.. ఇన్నేళ్ల తర్వాత తన విషకోరలు చాచాడు. వ్యాపారస్థుడి బ్యాంకు ఖాతా చూసుకునే భారతీయ బ్యాంకు అధికారితో కలిసి ఓ పథకం వేశాడు. ఆఫీసు నుంచి అవసరమైన పత్రాలు దొంగిలించాడు. వాటితో వ్యాపారస్థుడి ఖాతాకు తన ఫోన్ నంబరు, మెయిల్ ఐడీ జత చేశాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు కొంత చొప్పున సొమ్మును తన ఖాతాకు మళ్లించుకున్నాడు. ఇలా దాదాపు 20నెలలపాటు ఈ తతంగం సాగింది.

ఓసారి తన ఖాతాలో రూ.7.7లక్షలు మాయమవడంతో అనుమానించిన ఆ జోర్డానియన్ వ్యాపారస్థుడు.. తన మిత్రుడిని పిలిచి ఈ విషయంపై ఆరాతీశాడు. అతనే తనను మోసం చేసినట్లు అర్థంకాగానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం బ్యాంకు అధికారులను సంప్రదించాడు. తన ఖాత నుంచి డబ్బు మళ్లిస్తుంటే కనీసం తనకు సమాచారం ఇవ్వరా అని నిలదీశాడు. దీంతో బ్యాంకులో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగి నిర్వాకం కూడా బయటపడింది. ఈ ఘటన 2015లో వెలుగుచూసింది. నిందితులిద్దరూ కలిసే ఈ నేరానికి పాల్పడ్డారని, ఆ వ్యాపారస్థుడి ఖాతా నుంచి రూ.34కోట్లపైగా కాజేశారని పోలీసులు వెల్లడించారు. అయితే తాము ఎటువంటి నేరానికీ పాల్పడలేదని వీరిద్దరూ కోర్టులో వాదిస్తున్నారు. వీరిపై విచారణను కోర్టు అక్టోబరు 1కి వాయిదా వేసింది.