Indian-Family-to-be-Deported-from-Israel

ఇజ్రాయెల్‌లో భారత ఫ్యామిలీకి దేశ బహిష్కరణ‌.. కారణమిదే

జెరూసలేం: ఇజ్రాయెల్‌లో చట్టవిరుద్ధంగా నివాసం ఉంటున్నారని నలుగురు సభ్యులు గల భారత కుటుంబాన్ని ఆ దేశం బహిష్కరించింది. గురువారం దంపతులతో పాటు వారి ఇద్దరు పిల్లలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే ఫ్యామిలీని తిరిగి స్వదేశానికి పంపిస్తామని ఇజ్రాయెల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే... కర్నాటకకు చెందిన దంపతులు టీనా, మినిన్ లోపెజ్ 12 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ వెళ్లారు. అక్కడ నర్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు ఇలియానా(7), ఏడాది వయసు గల కొడుకు ఉన్నాడు. ఈ ఇద్దరు పిల్లలు కూడా ఇజ్రాయెల్‌లోనే పుట్టారు. చిన్నపిల్లోడు మినహా కుటుంబం మొత్తం 2018, ఫిబ్రవరిలో కూతురు జనన నమోదు కోసం భారత రాయబార కార్యాలయానికి వెళ్లారు. కానీ ఫార్మాలిటీలను పూర్తి చేయకుండానే వెనుదిరిగారు. అదే ఇప్పుడు ఈ ఫ్యామిలీకి చిక్కులు తెచ్చిపెట్టింది. తాజాగా ఇమ్మిగ్రేషన్ అధికారుల విచారణలో పిల్లల జనన ధృవపత్రాలు లేకపోవడంతో ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్ట్ చేసి సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని బీట్ దగన్ నిర్బంధ కేంద్రానికి తరలించారు. గురువారం రాత్రి వారు విడుదలైనప్పటికీ సంబంధిత లాంఛనాలు పూర్తయిన వెంటనే కుటుంబం దేశం నుంచి బహిష్కరించబడుతుందని అధికారులు తెలిపారు. దేశంలో అక్రమ వలస కార్మికులను నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా చట్టవిరుద్ధంగా, ఎలాంటి ధృవపత్రాలు లేకుండా ఉంటున్న పలువురు విదేశీయులను ఆ దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.