Indian-American-Sampat-Shivangi-to-serve-on-panel-of-US-health-body

భారతీయుడికి కీలక పదవిని అప్పగించిన ట్రంప్

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన సంపత్ శివంగిని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్‌లోకి తీసుకుంటున్నట్టు యూఎస్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ అలెక్స్ అజార్ ప్రకటించారు. సంపత్‌ను కౌన్సిల్‌లోకి ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉందని అలెక్స్ అన్నారు. మెంటల్ హెల్త్‌కు సంబంధించి నేషనల్ అడ్వైజరీ కమిటీ పనిచేస్తుందని.. ఇందులో సంపత్ శివంగి సేవలను కూడా వినియోగించుకోనున్నట్టు ఆయన తెలిపారు. తనను నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్‌లోకి తీసుకోవడం పట్ల సంపత్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు, యూఎస్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

కాగా, సంపత్ శివంగి వైద్యవృత్తిలో కొనసాగుతూనే.. మిస్సిసిప్పీ స్టేట్ బోర్డ్ ఆఫ్ మెంటల్ హెల్త్‌కు చైర్మన్, వైస్‌చైర్మన్‌గా పదేళ్ల నుంచి తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా జార్జ్ బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2005 నుంచి 2008 వరకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్‌కు అడ్వైజర్‌గా ఉన్నారు. అమెరికా అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఇన్ మిస్సిసిప్పీకి ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు. ఇండియా అసోసియేషన్ ఆఫ్ మిస్సిస్సిప్పీకి కూడా ఆయన అధ్యక్షుడిగా సేవలందించారు. భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత ధృడ పడేలా ఆయన చేసిన విశేష సేవలను గుర్తించి 2017లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును ప్రకటించారు. కాగా, సంపత్ శివంగి రిపబ్లిక్ పార్టీకి ఎన్నో దశాబ్దాల నుంచి విధేయుడిగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. రిపబ్లిక్ పార్టీ బలంగా ఉన్న మిస్సిసిప్పీ ప్రాంతంలోనే ఆయన కూడా నివసిస్తున్నారు.