Indian-American-Medical-Student-Falls-To-Death-In-Philadelphia

అమెరికాలో భారత సంతతి మెడికల్ విద్యార్థి మృతి

ఫిలాడెల్ఫియా: భారతదేశానికి చెందిన వివేక్ సుబ్రమణి(23) అనే మెడికల్ విద్యార్థి ప్రమాదవశాత్తు అమెరికాలో మరణించాడు. వాషింగ్టన్‌లోని ఫిలాడెల్ఫియాలో ఈ విచార సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వివేక్ తాను నివాసముంటున్న అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌పైకి జనవరి 11న రాత్రి సమయంలో ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లాడు. బిల్డింగ్‌ పైనున్న రూఫ్ టాప్‌లపై ముగ్గురూ దూకడానికి ప్రయత్నించారు. ఇదే సమయంలో వివేక్ అదుపుతప్పి కిందకు పడిపోయాడు. రక్తపు మడుగుల్లో పడి ఉన్న వివేక్‌ను అతడి స్నేహితులు వెంటనే థామస్ జెఫర్‌స్ యూనివర్శిటీ ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. పైనుంచి పడిన నిమిషాల వ్యవధిలోనే వివేక్ చనిపోయినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.

ఇదిలా ఉండగా.. వివేక్ మరణవార్తను విన్న కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ కొడుకును డాక్టర్‌గా చూడాలనుకున్న తమ ఆశ ఆవిరిగా మారిపోయిందంటూ వివేక్ తల్లిదండ్రులు ఆవేదన చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఫిలాడెల్ఫాయా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదం జరిగే కొద్ది గంటల క్రితం వివేక్ అతడి స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్టు పోలీసులు చెబుతున్నారు. కాగా.. వివేక్ డ్రెగ్జిల్ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను అభ్యసిస్తున్నాడు. డాక్టర్ అవ్వాలనుకున్న అతడి కల ఇలా ముగుస్తుందని అనుకోలేదంటూ తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.