I-lost-my-entire-family-in-Ethiopian-Crash,-NRI-mananth

విమాన ప్రమాదంలో.. కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకున్న ఎన్నారై

బ్రంప్టన్: ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఇటీవల కుప్పకూలిన విషయం విధితమే. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 157 మంది ప్రాణాలు కోల్పోయారు. టేక్ ఆఫ్ అయిన ఆరు నిమిషాలకే ఈ విమానం కూలిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో కెన్యా దేశస్థులే అధిక శాతం మరణించినట్టు విమాన యాజమాన్యం ప్రకటించింది. కెనడాలో స్థిరపడిని ఎన్నారై మనంత్ వైద్యా కుటుంబం మొత్తం ఈ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయారు. కెన్యాలోని సఫారీ పార్క్‌ను సందర్శించేందుకు వెళ్లిన తన కుటుంబం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని మనంత్ కన్నీటి పర్యంతమయ్యారు. జీవితంలో మరచిపోలేని విధంగా ఈ ట్రిప్ ఉంటుందని తనతో అన్నారని.. నిజంగానే మరిచిపోలేని విధంగా తనను ఒంటరిని చేసి వెళ్లిపోయారని ఆవేదన చెందారు. జరిగిన ప్రమాదంలో పన్నగేష్ వైద్య(73), ఆయన భార్య హాంసిని వైద్య(67), వారి కూతురు కోషా వైద్య(37), అల్లుడు ప్రెరిత్ దీక్షిత్(45), పిల్లలు అనుష్క, అష్కా మరణించారు. జరిగిన ఘటనకు చింతిస్తున్నామని కెనడాలోని బ్రంప్టన్ నగర్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ తెలిపారు. అనుష్క, అష్కా చదువుతున్న స్కూలులో కూడా ఈ విషయం తెలియడంతో ఒక్కసారిగా విషాదానికి గురయ్యారు. వారి మరణానికి చింతిస్తూ జెండా అవనతం చేయనున్నట్టు స్కూలు యాజమాన్యం ట్వీట్ చేసింది. తన కుటుంబసభ్యుల అస్థికల కోసం కాన్సురల్ అధికారులను సంప్రదిస్తున్నట్టు మనంత్ చెప్పారు. కాగా, మనంత్ కుటుంబం గుజరాత్‌లోని సూరత్‌కు చెందింది. కెనడాలో వారి కుటుంబం మొత్తం స్థిరపడింది.