Hyderabadi-abondoned-in-Saudi-hospital

30 ఏళ్లు సౌదీలో పనిచేసి.. మంచానపడ్డ హైదరబాదీ.. పట్టించుకోని పుత్రరత్నం.. చివరకు..

రియాద్: సౌదీ అరేబియాలోని ఓ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఆఫీసులో 30ఏళ్లుగా పనిచేసిన ఓ హైదరబాదీని ఇటీవలే ఉద్యోగం నుంచి తొలగించారు. 61ఏళ్ల వయసులో అతనేం పనిచేయలేడని భావించిన కంపెనీ యాజమాన్యం అతన్ని విధుల నుంచి తప్పించింది. ఈ నిర్ణయమే హైదరాబాద్‌లోని మురాద్‌నగర్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ జబ్బార్ పాలిట శాపమైంది. కొంతకాలంగా డయాబెటీస్‌తో బాధపడుతున్న జబ్బార్.. ఉద్యోగం కోల్పోయిన కొన్ని రోజులకే మంచానపడ్డాడు. దాంతో ఈ ఏడాది మార్చి 8న అతను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. అక్కడ ఉండగానే అతని వీసా గడువు ముగిసింది. అతని వైద్య ఖర్చులు కూడా 3.5లక్షల సౌదీ రియాల్స్ (దాదాపు రూ.66లక్షలు) దాటేశాయి. అవి కట్టడానికి జబ్బార్ వద్ద పైసాకూడా లేదు. ఎంతో ప్రేమతో దత్తత తీసుకున్న ఒక్కగానొక్క కొడుకు.. తనకేం సంబంధం లేదని చేతులెత్తేయడంతో జబ్బార్ ప్రపంచమే తలకిందులయింది.

ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిధులు.. ఆస్పత్రి వర్గాలను సంప్రదించి జబ్బార్ మెడికల్ బిల్లును మాఫీ చేయాలని కోరారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి యాజమాన్యం.. జబ్బార్ బిల్లును పూర్తిగా మాఫీ చేయడం కుదరదని, కనీసం 23వేల సౌదీ రియాల్స్(రూ.4లక్షలపైగా) చెల్లించాలని కోరింది. విషయం తెలుసుకున్న భారత ఎంబసీ దాదాపు రూ.3.5లక్షలు చెల్లించడానికి ముందుకొచ్చింది. అలానే జబ్బార్‌ను హైదరాబాద్ పంపడానికి అయ్యే ఖర్చులన్నీ పెట్టుకుంటామని చెప్పింది. దీంతో మిగతా సొమ్మును సిద్ధం చేసిన తెలంగాణ ఎన్నారై ఫోరం.. జబ్బార్‌ను చేర్పించుకోవడానికి హైదరాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమాన్ని ఒప్పించింది. అనారోగ్యంతో ఉన్న జబ్బార్‌కు ఓ మలయాళీ సామాజిక కార్యకర్తను తోడుగా పంపనున్నట్లు భారత ఎంబసీ ప్రకటించింది. ఇటీవలే హైదరాబాద్‌కు చేరుకున్న జబ్బార్.. తన కోసం ఇంత కష్టపడిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశాడు.