Howdy-Modi-is-huge-Honour-to-Indian-Origins-says-PM-Modi

'హౌడీ మోదీ' భారత సంతతికి ఇదో పెద్ద గౌరవం.. అమెరికా వెళ్లే ముందు మోదీ వ్యాఖ్య

రేపు హ్యూస్టన్‌లో ఒకే వేదికపై ఇద్దరు నేతలు

న్యూఢిల్లీ: హౌడీ మోదీ సభ భారత-అమెరికా సంబంధాల్లో ఓ మైలురాయి కాగలదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో దాదాపు 50,000 మంది భారత సంతతి ప్రజలు పాల్గొనే సభ (హౌడీ మోదీ)లో ప్రధాని పాల్గొంటున్నారు. అమెరికా కాలమానం ప్రకారం 22వ తేదీ ఉదయం 10:45 గంటలకు ఇది జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ సభలో పాల్గొనడం మొత్తం భారతీయ అమెరికన్లందరికీ ఓ పెద్ద గౌరవమని మోదీ అన్నారు. తనతో కలిసి భారత సంతతి ప్రజలనుద్దేశించి ట్రంప్‌ మాట్లాడడం ఇదే ప్రథమమని, భారతీయులను ఇది అమెరికాకు మరింత చేరువ చేస్తుందని మోదీ పేర్కొన్నారు. అనేక మంది కాంగ్రెస్‌ సభ్యులు, మేయర్లు, అమెరికన్‌ ప్రముఖులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.
 
‘‘ఉమ్మడి ప్రయోజనాలు, బలాలు, విలువలు రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సహజ భాగస్వామ్యానికి పునాది వేస్తున్నాయి. కలిసి పనిచేస్తే శాంతి, సుస్థిర, భద్రత, సౌభాగ్య ప్రపంచ నిర్మాణానికి ఎంతో తోడ్పడగలం’’ అని మోదీ- శుక్రవారం రాత్రి అమెరికాకు బయల్దేరి వెళ్లే ముందు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికాలో మోదీది చాలా బిజీ షెడ్యూల్‌. అనేక మంది వాణిజ్యవేత్తలను ఆయన కలుస్తున్నారు. ముఖ్యంగా ఈనెల 27న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ఆయన చేసే ప్రసంగంపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. కశ్మీర్‌పై సంచలన నిర్ణయం తరువాత ఆయన ప్రపంచ దేశాధినేతలందరినీ ఉద్దేశించి మాట్లాడడం ఇదే ప్రథమం.
 
మోదీపై కోర్టు కేసు
హ్యూస్టన్‌లో అడుగుపెట్టకమునుపే ఓ స్థానిక కోర్టు ప్రధాని మోదీకి సమన్లు జారీచేసింది. జమ్మూ కశ్మీర్‌ను ఏకపక్షంగా విలీనం చేశారని, సైనికులను మోహరించి ప్రజల హక్కులను కాలరాశారని ఆరోపిస్తూ మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలపై కశ్మీర్‌ ఖలిస్థాన్‌ రెఫరెండం ఫ్రంట్‌ అనే సంస్థ ఓ పిటిషన్‌ను స్థానిక సివిల్‌ కోర్టులో దాఖలు చేసింది. లోయలో ఇష్టానుసారం ప్రజలను ఎన్‌కౌంటర్‌ చేస్తున్నారని అంటూ సైన్యాధికారి లెఫ్టినెంట్‌ జనరల్‌ కన్వల్జిత్‌సింగ్‌ ధిల్లాన్‌ను కూడా ఓ నిందితుడిగా పేర్కొంది. హ్యూస్టన్‌లో సెటిలైన ఇద్దరు కశ్మీరీలు ఈ కేసు వేసినట్లు హ్యూస్టన్‌ క్రానికల్‌ పత్రిక తెలిపింది. అయితే ఈ కేసు వల్ల మోదీ పర్యటనకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఆయనకు న్యాయపరమైన రక్షణ కల్పించే బాధ్యతను అమెరికా విదేశాంగ శాఖే నిర్వర్తించాల్సి ఉంటుంది. కాగా, మోదీ సభను నిరసిస్తూ భారీ ప్రదర్శన చేయాలని ఇం టర్నేషనల్‌ హ్యమనిటేరియన్‌ ఫౌండేషన్‌ నిర్ణయించింది. కశ్మీ ర్లో మానవహక్కుల అణచివేతను నిరసిస్తున్నట్లు పేర్కొంది.