How-Bomb-Cyclone-happened-in-US

అమెరికా అతలాకుతలం.. 25రాష్ట్రాల్లో స్తంభించిన జనజీవనం

డెన్వర్: అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. ఈ ‘బాంబ్ సైక్లోన్’ ధాటికి ఇప్పటికే సుమారు 25రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. దీంతో ఒక్క డెన్వర్‌లోనే 46 వేలకుపైగా కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, దాంతో విద్యుత్ వినియోగదారుల్లో 94శాతం అంటే సుమారు 4లక్షల 35వేల మంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ప్రకటించింది. రహదారులపై 80 చోట్ల ట్రాఫిక్ సిగ్నళ్లు కూడా పనిచేయడం లేదని అధికారులు చెప్పారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ విభాగం సుమారు 800 మంది సిబ్బందిని రంగంలోకి దింపిందని, వీరేకాక ఇతర శాఖలకు చెందిన వారి సాయం కూడా తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పోలీసు శాఖ డెన్వర్‌లో రెండు చోట్ల ‘వార్మింగ్ సెంటర్స్’ (వేడి కేంద్రాలు) ఏర్పాటు చేసిందని చెప్పారు.

అమెరికాను అతలాకుతలం చేస్తున్న ‘బాంబ్ సైక్లోన్’ కదలికలు నాసా కంటికి చాలా స్పష్టంగా కనిపించాయి. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను అధికారులు బయటపెట్టారు. వీటి ఆధారంగా ఈ మంచు తుఫాను కదలికలను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. మధ్య అమెరికా ప్రాంతాన్ని కూడా ఈ తుఫాను చుట్టుముడుతుందని స్పష్టం చేశారు. ఈ తుఫాను తన చివరి దశలో ఉందని, తూర్పు కెనడా వైపు కదులుతున్న ఇది అక్కడికి చేరుకున్న కొన్ని గంటల్లో అంతరిస్తుందని భావిస్తున్నట్లు వివరించారు.

అసలేంటీ ‘బాంబ్ సైక్లోన్’..?
సాధారణంగా తుఫాన్లు వాతావరణంలో మార్పుల వల్ల వస్తాయి. మరి ఈ ‘బాంబ్ సైక్లోన్’ ఏంటి.. ఏదైనా బాంబు పేలితే వస్తుందా అని చాలా మందికి అనుమానం కలుగుతుంది. ఒక విధంగా ఆలోచిస్తే ఈ తుఫాను అలాంటిదే. ఇంతకీ ఈ ‘బాంబ్ సైక్లోన్’ ఏంటో తెలుసా?.. సాధారణంగా వాతావరణ మార్పల్లో పీడనం చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. పీడనంలో వచ్చే చిన్న చిన్న మార్పుల వల్లే తుఫాన్లు చెలరేగుతుంటాయి. సాధారణంగా భూమిపై ఉండే పీడనం వెయ్యి మిల్లీబార్‌లు (పీడనాన్ని కొలిచే కొలమానం). ఈ పీడనం పెరుగుతూ తగ్గుతూ ఉండటం వల్లే మనకు చలి, వేడిలో మార్పులు వస్తుంటాయి. ఇలా ప్రతీచోటా సాధారణంగా పీడనంలో 24 గంటల్లో 12 మిల్లీబార్ల మార్పులు వస్తుంటాయి. అంతకన్నా ఎక్కువగా పీడనం మారితే అక్కడ కొంత విపరీత వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. అదే గనుక పీడనంలో 24 మిల్లీబార్లు తేడా వస్తే అప్పుడు దాన్ని ‘బాంబ్ సైక్లోన్’ అంటారు. అలాంటప్పుడు వాతావరణం విపరీత పరిస్థితులను చవిచూస్తుంది. బలమైన గాలులు, వర్షాలతో బీభత్సంగా మారుతుంది. 

అమెరికాలో ఏం జరిగింది? 

సాధారణంగా ఓ ప్రాంతంలోని పీడనంలో 24గంటల్లో 24 మిల్లీబార్ల తేడా వస్తేనే దారుణమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటిది ఇప్పుడు అగ్రరాజ్యంలో వచ్చిన తుఫాను వల్ల ఈ ప్రాంతంలోని పీడనంలో 24 గంటల్లోనే 33మిల్లీబార్ల మార్పులు వచ్చాయి. దీన్ని బట్టే ఇక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రాకీ పర్వతాల మీద నుంచి వీచిన అల్పపీడన గాలులు సముద్రం నుంచి వీచే వేడి గాలులు ఢీకొట్టాయి. దీంతో ఉపరితల వాతావరణంలోని గాలులు తమ కేంద్ర బిందువును వీడి పక్కకి వెళ్లడం మొదలెట్టాయి. దీని వల్ల ఉపరితల వాతావరణంలో పీడనం తగ్గిపోవడంతో క్షితిజ సమాంతరంగా ఉన్న గాలులు పైకి వెళ్లిపోవడం ప్రారంభించాయి. ఈ కారణంగా భూ ఉపరితలంపై పీడనం విపరీతంగా తగ్గిపోవడంతో ‘బాంబ్ సైక్లోన్’ ఏర్పడింది. ఇలా బాంబ్ సైక్లోన్‌లు ఏర్పడటం చాలా అరుదు.