Hindu-temples-expanding-in-US

అమెరికాలో విస్తరిస్తున్న హిందూ ఆలయాలు.. రోల్స్‌ రాయిస్‌, బెంజ్‌ కార్లలో పూజారులు

  • నిత్య పూజలు, హోమాలు, వేదఘోషతో కిటకిట
  • బాబాలు, స్వామీజీలు, మాతాజీల రాకపోకలు
  • అగ్రరాజ్యంలో ఆధ్యాత్మిక గుబాళింపు
(న్యూయార్క్‌ నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి కిలారు ముద్దు కృష్ణ): అగ్రరాజ్యం అమెరికాలో ఆధ్యాత్మిక గుబాళింపులు! బిజీలై్‌ఫలోనూ అక్కడి జనాలు.. నిత్య పూజలు, వ్రతాలు, హోమాలు చేస్తూ తరిస్తున్నారు. ఏ ఆలయంలో చూసినా నిత్యం భక్తుల సందడే! అమెరికాలో హిందూ దేవాలయాలు విస్తరిస్తున్నాయి. ఇక్కడ వేలాది హిందూ దేవాలయాల్లో తెలుగువారు నిర్వహిస్తున్న ఆలయాలే ఎక్కువ. 70వ దశకంలో న్యూయార్కలోని ఫ్లెషింగ్‌ వినాయక దేవాలయం పిట్స్‌బర్గ్‌, మాలీబూ లివర్‌ మూర్‌ వంటి చోట్ల వెంకటేశ్వరస్వామి దేవాలయాలు మాత్రమే ఉండేవి. రానురాను ప్రతి చిన్న నగరంలోనూ తెలుగువారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆలయాలు వెలుస్తున్నాయి. న్యూజెర్సీలో ఉన్న బ్రిడ్జి వాటర్‌ టెంపుల్‌, గురువాయుర్‌ ఆలయం నిత్యం వేల మంది భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
 
న్యూజెర్సీలో తెలుగువారు ఎక్కువగా ఉండే ఎడిషన్‌ ప్రాంతంలో ప్రముఖ క్యేన్సర్‌ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు సారఽథ్యంలో దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే షిర్డీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు. విజయవాడ సాయిబాబా గుడిలో అర్చకుడిగా ఉన్న శంకరమంచి రఘుశర్మ ’అమెరికాలో షిర్డీ‘ అనే భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 25ఎకరాలను కొనుగోలు చేశారు. ఆలయ నిర్మాణానికి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. న్యూజెర్సీ మంత్రి చివుకుల ఉపేంద్ర ఈ ప్రాజెక్టుకు ప్రధాన ట్రస్టీగా ఉన్నారు. గతంలో వారాంతాల్లోనే హిందూ దేవాలయాలకు భక్తులు వచ్చేశారు.
 
ఇప్పుడు ఆలయాలకు రోజూ భక్తుల తాకిడి ఉంటోంది. ప్రతి రోజు హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమల, భద్రాచలం, అన్నవరం తదితర దేవాలయాల నుంచి ఉత్సవ విగ్రహాలతో అమెరికాకు అర్చకులు వచ్చి కల్యాణాలు నిర్వహిస్తున్నారు. వాషింగ్టన్‌ డీసీ సమీపంలో ఉన్న శివ-విష్ణు దేవాలయంలో అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఉంది. ఏటా నవంబరు నుంచి సంక్రాంతి మధ్య ఇక్కడ వేలమంది భక్తులు అయ్యప్ప మాలను ధరిస్తారు.
 
ప్రవచన, యోగా కేంద్రాలుగానూ..
ఇక్కడ దేవాలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు భక్తులక కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రవచనాలు, యోగా తరగతులు, నృత్యశిక్షణ, తెలుగు భాషను నేర్పడం వంటివి చేపడుతున్నారు. దాతల విరాళాలతో అధికశాతం ఆలయాలు నడుస్తున్నాయి. ప్రఖ్యాత లివర్‌ మోర్‌ దేవాలయంలో సమావేశ మందిరం నిర్మాణానికి ఎన్నారై డాక్టర్‌ లక్కిరెడ్డి హనిమిరెడ్డి పదికోట్లు విరాళంగా అందించారు.
 
స్వాములు, బాబాల క్యూ..
అమెరికాకు ఇటీవల స్వామీజీలు, బాబాల రాకపోకలు బాగా పెరిగాయి. డాల్‌సలో భారీగా నిర్మించిన హనుమాన్‌ దేవాలయాన్ని నిర్వహించే బాధ్యతను గణపతి సచ్చిదానంద స్వామికి అప్పగించారు. న్యూజెర్సీ కేంద్రంగా చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో జీయర్‌ ట్రస్టు ద్వారా అమెరికా నలుమూలలా ఉన్న దేవాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశ్వయోగి విశ్వంజీ, మాతా అమృతానందమాయి, జగ్గీ వాసుదేవ బాబా, మాతా తుల చైతన్య తదితరులు ఏడాదిలో నాలుగైదు నెలల పాటు అమెరికాలోనే ఉంటూ పెద్ద పెద్ద దేవాలయాల నిర్వహణ బాధ్యతలను చేపడుతున్నారు.
 
రోల్స్‌ రాయిస్‌, బెంజ్‌ కార్లలో పూజారులు
అమెరికాలో ఆధ్యాత్మిక వైభవం తెలుగు రాష్ట్రాల్లోని పూజరులను ఆకర్షిస్తోంది.గుళ్లలో విధులు నిర్వహిస్తూనే ప్రవాస తెలుగు కుటుంబాల్లో హోమాలు, వ్రతాలు ఇతర శుభకార్యాలు జరిపిస్తూ వేల డాలర్లు ఆర్జిస్తున్నారు. అమెరికాలో ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల కన్నా అయ్యవార్ల ఆదాయమే ఎక్కువన్న అభిప్రాయం ఉంది. కొందరు అర్చకులు రోల్స్‌ రాయిస్‌, బెంజి, బీఎండబ్ల్యూ కార్లలో పూజలకు హాజరవుతున్నారు.