highest-cost-for-flight-tickets-

చుక్కలు చూపిస్తున్న విమాన టిక్కెట్ల ధరలు

సంక్రాంతికి చుక్కలు చూపిస్తున్న చార్జీలు
థాయ్‌లాండ్‌ కంటే కోస్తాకే ఎక్కువ ధరలు
థాయ్‌లాండ్‌కు చార్జీ 8,900.. రాజమండ్రికి 18,105
విశాఖకు శుక్రవారం 18,226..శనివారం 18,477
తెలుగునాట కిక్కిరిసిన ఎయిర్‌పోర్టులు
విశాఖ, రాజమండ్రి, విజయవాడలకు రద్దీ
హైదరాబాద్‌ నుంచి థాయ్‌లాండ్‌కు శుక్రవారం విమాన టిక్కెట్‌ ధర రూ.8,900. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి నేరుగా విమాన సర్వీసు టిక్కెట్‌ ధర ఎంతో తెలుసా? రూ. 18,105. అలాగే హైదరాబాద్‌ నుంచి విశాఖకు శుక్రవారం ధర (గురువారం రాత్రి 10గంటలకు పేర్కొన్న వివరాల ప్రకారం) రూ. 18,226గా ఉండగా.. శనివారం అది అమాంతం రూ. 18,477కు పెరిగిపోయింది. విజయవాడకు అసలు టిక్కెట్లే లేవు. ఈ ధరలు గంటగంటకూ పెరిగిపోతున్నాయి. సంక్రాంతికి జనమంతా సొంతూరు బాట పట్టడమే ఇందుకు కారణం. కోస్తాకు బస్సులు, రైళ్లతో పాటు విమానాలు కూడా కిక్కిరిసిసోతున్నాయి. గురువారం హైదరాబాద్‌ నుంచి కోస్తాకు వెళ్లే విమానాలన్నీ ఫుల్‌ అయ్యాయి. హైదరాబాద్‌ నుంచి విదేశాలకు వెళ్లేందుకు టిక్కెట్లు దొరుకుతున్నప్పటికీ కోస్తాలోని విశాఖ, విజయవాడ, రాజమండ్రికి మాత్రం ఆశలు సన్నగిల్లుతున్నాయి. శుక్రవారం ఆన్‌లైన్‌లో పరిశీలిస్తే థాయ్‌లాండ్‌తో పాటు సింగపూర్‌, మలేసియా, శ్రీలంక, దుబాయ్‌ కంటే రాజమండ్రి, విశాఖపట్నం,. విజయవాడకు అధికంగా విమాన టిక్కెట్టు ధరలు ఉండడం గమనార్హం.
 
బ్యాంకాక్‌లో నాలుగు రోజులు
హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి ఈ నెల 12న వెళ్లి.. 16న తిరిగి వచ్చేందుకు తక్కువ ధరలకు దేశీయ గమ్యస్థానాలను చేర్చే ఇండిగోలో చార్జీ రూ. 23,662గా ఉంది. అదే సమయంలో.. సంక్రాంతికి ఎంచక్కా టూరిస్టు స్పాట్‌ అయిన బ్యాంకాక్‌ (థాయ్‌లాండ్‌) వెళ్లేవారికి బంపర్‌ ఆఫర్‌..! ఎయిరిండియా విమానంలో రౌండ్‌ట్రిప్‌ చార్జీ రూ. 16,414 మాత్రమే. రూ. 2,000 వీసా చార్జీ, అక్కడ హోటళ్లలో నాలుగు రోజులపాటు బస, పర్యాటక ప్రదేశాల సందర్శన ఖర్చు కలుపుకొన్నా.. రాజమండ్రి ఫ్లైట్‌ టికెట్‌ కంటే చాలా తక్కువ. ఇక ఇదే రోజుల్లో పలు దేశాల టికెట్‌ ధరలు (రానుపోను చార్జీలు కలిపి) చాలా తక్కువగా (శ్రీలంకకు రూ. 22,673, నేపాల్‌కు రూ. 19,449, మలేసియాకు రూ. 22,435, సింగపూర్‌కు రూ. 21,348) ఉన్నాయి.