H1B-visa-denials-behind-attrition,-says-Infosys

హెచ్1బీ వీసాల నిరాకరణతో.. విలవిలలాడుతున్న ఇండియన్ టెక్ కంపెనీలు

బెంగళూరు: హెచ్1బీ వీసాల జారీలో అమెరికా ప్రభుత్వం భారత కంపెనీలకు ప్రతి ఏడాది మొండిచేయి చూపిస్తూనే వస్తోంది. వీసా నిరాకరణ కారణంగా వేలాది మంది ఉద్యోగులను కోల్పోతున్నామని భారత్ కంపెనీలు వాపోతున్నాయి. ప్రముఖ కంపెనీ ఇన్‌ఫోసిస్ ఎక్కువగా తమ ఉద్యోగులను కోల్పోతున్నట్టు ప్రకటించింది. హెచ్1బీ వీసాలను ఎక్కువగా మాస్టర్స్ డిగ్రీ చేసిన వారికే ఇస్తున్నారని.. వారంతా అమెరికన్ కంపెనీలలోనే పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారని ఇన్ఫోసిస్ సీఓఓ తెలిపారు. ఇన్ఫోసిస్ దరఖాస్తు చేసుకున్న 2042 హెచ్1బీ వీసాలను అమెరికా అధికారులు నిరాకరించారని అమెరికాలోని ఓ సంస్థ ఇటీవల ఓ జాబితాను విడుదల చేసింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, టెక్ మహీంద్ర, హెచెసీఎల్.. ఈ ఆరు కంపెనీలు వీసా నిరాకరణకు ఎక్కువగా గురవుతున్నాయని ఆ సంస్థ పేర్కొంది. 2018 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ కంపెనీకి 2399 హెచ్1బీ వీసాలను జారీ చేయగా.. ఈ ఆరు కంపెనీలకు కలిపి కేవలం 2145 వీసాలను జారీ చేశారని సంస్థ తెలిపింది. ఇన్ఫోసిస్ కంపెనీ దరఖాస్తులు ఇతర కంపెనీల కంటే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగా ఎక్కువ అర్హత ఉన్న ఉద్యోగులను కోల్పోతున్నట్టు.. దీన్ని ఆపడానికి కొత్త ప్రతిపాదనలు తీసుకురానున్నట్టు ఇన్ఫోసిస్ సీఓఓ తెలిపారు. ఆన్‌సైట్ అవకాశాల కోసం ఉద్యోగులు ఎక్కువగా చూస్తారని.. వీసా నిరాకరణ ద్వారా అది జరగడం లేదని చెప్పారు. దీన్ని ఆపడానికి ఇంక్రిమెంట్స్, ఇన్‌సెంటివ్స్ అంటూ ఇన్‌ఫోసిస్ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. కేవలం ఇంక్రిమెంట్ల ద్వారా ఎంప్లాయిూ అట్రిషన్ ఆపలేమని..ఎక్స్‌పెన్స్ మేనేజ్‌మెంట్ ద్వారా మరిన్ని అవకాశాలను ఉద్యోగులకు కల్పిస్తూ వారిని కొత్త టెక్నాలజీలు, ప్రాజెక్టులలో పనిచేయించేలా అవకాశమిస్తే ఈ అట్రిషన్‌ను ఆపగలమని సీఓఓ తెలపారు.