Gun-in-infants-mouth-video-goes-viral

పసివాడి నోట్లో తుపాకీ.. పకపకా నవ్వుతూ వీడియో.. చూసిన పోలీసులు షాక్..

రియాద్: సౌదీ రాజధాని రియాద్‌లో భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని ఓ పసివాడి నోట్లో తుపాకీ పెట్టిన ఓ యువకుడు.. పకపకా నవ్వుతూ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. వివరాల్లోకి వెళ్లితే.. రియాద్‌కు చెందిన ఓ యువకుడు.. ఏడాది  వయసున్నతన తమ్ముడిని ఎత్తుకున్నాడు. పసివాడి పుట్టినరోజు వేడుకలు జరుగుతుండగా.. ఓ తుపాకీ తెచ్చి గాల్లో కాల్పులు జరిపాడు. ఆ చప్పుళ్లకు బెదిరిపోయిన పసివాడు గుక్కపట్టాడు. ఇదంతా వీడియో తీస్తున్న మరో వ్యక్తి.. పసివాడికి గన్‌పౌడర్ వాసన చూపించాలని చెప్పాడు. దీంతో ఆ యువకుడు.. పసివాడి నోట్లో తుపాకీ పెట్టి పెద్దగా నవ్వసాగాడు.

ఈ వీడియోలో తుపాకీ పట్టుకున్న యువకుడి మొఖం కనిపించలేదు. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఈ వీడియో క్షణాల్లోనే వైరలయింది. ఈ వీడియోలోని యువకుడిపై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. పసివాణ్ణి భయపెట్టి వికృతానందం పొందుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఈ విషయం తెలుసుకున్న సౌదీ పోలీసులు.. నిందితులెవరో తెలుసుకున్నారని, తుపాకీ పేల్చిన యువకుడిని అరెస్టు చేశారని సమాచారం. సౌదీలో ఎటువంటి ఫంక్షన్లు చేసుకున్నా తుపాకులు పేల్చడం నిషిద్ధమని తెలిపిన అధికారులు.. అయినాసరే ప్రజలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.