God-told-to-kill-people

దేవుడు చెప్పాడని.. ఆ కిరాతకుడు ఏం చేశాడంటే..

అరిజోనా: దేవుడు చెప్పాడంటూ ఓ కిరాతకుడు దారుణానికి ఒడిగట్టాడు. పరాయివాడితో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకొందన్న అనుమానంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఆమెను ‘పాపి’ అంటూ తుపాకీతో కాల్చిపారేశాడు. ఆ దృశ్యాన్ని చూసి ఏడ్చిన ఏడేళ్ల పెద్ద కూతురిని గది సీలింగ్‌కేసి బాదాడు. అంత ఎత్తు నుంచి నేలపై పడటంతో ఆమె తలకు తీవ్రంగా గాయమైంది. అదే సమయంలో ఏడుస్తున్న ఐదేళ్ల కొడుకును కూడా బలవంతంగా ఆ అమ్మాయి పక్కనే పడేశాడు. బేస్‌బాల్ బ్యాట్ తీసుకొని వారిద్దరినీ పచ్చడికింద కొట్టి చంపేశాడు. తండ్రి కిరాతకాన్ని చూసి భయపడిపోయిన మూడేళ్ల ఆఖరి కూతురు భయంభయంగా వెళ్లి మంచం కింద నక్కింది. ఆమెను పట్టించుకోకుండా బయటకు వచ్చేసిన ఆస్టిన్ స్మిత్.. నేరుగా తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తాను అనుమానిస్తున్న వ్యక్తి ఇంటికెళ్లాడు. అతని సోదరుడు తనకు ఎదురవడంతో వెంటనే అతన్ని కూడా కాల్చి చంపేశాడు. ఇదంతా అమెరికాలోని అరిజోనాలో జరిగిన ఈ దారుణం గురించి స్థానికులు ఫిర్యాదు చేశారు. దాంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. స్మిత్‌ ఎక్కడున్నాడో ట్రాక్ చేసి పట్టుకున్నారు. అతని మూడో కూతుర్ని పిల్లల సంరక్షణ కేంద్రంలో చేర్పించారు. కోర్టు ముందు తాను చేసిన నేరాలన్నింటినీ ఒప్పుకున్న స్మిత్.. తనకు దేవుడు చెప్పినందువల్లే తాను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పాడు. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకొని తప్పు చేసిందని, అటువంటి పాపి కోసం ఏడ్చి తన పిల్లలు తప్పు చేశారని అందుకనే వారందరినీ శిక్షించానని స్పష్టం చేశాడు. స్మిత్ కారులోంచి .45 కాలిబర్, 9ఎంఎం హ్యండ్‌గన్, .223 కాలిబర్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతనిపై నాలుగు హత్య కేసులు, రెండు హత్యాయత్నం కేసులు పెట్టినట్లు చెప్పారు.

Related Articles