Girl-Born-Without-Hands-Wins-National-Handwriting-Competition

చేతులు లేకపోతేనేం.. గెలవగలనన్న పట్టుదల ఉంది సారాకు..!

మేరీల్యాండ్: కష్టాలు వస్తే ఆనందపడమని ఓ కవి చెప్పాడు. కష్టాన్ని సహించి జీవితంలో గెలిచిన మనుషులు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకోగలరని ఆ కవి ఉద్దేశం.  అమెరికాలోని ఓ పాప కవి చెప్పినట్టే తనకు వచ్చిన కష్టాన్ని ఆనందంగా తీసుకుని జీవితాన్ని గెలిచి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఆ పాప పేరు సారా హైన్స్‌లే. వయసు కేవలం పదేళ్లు. సారాకు పుట్టుకతోనే చేతుల్లేవు. అయితేనేం తాను అనుకున్నది సాధిస్తాననే నమ్మకం ఉంది. ఏదైనా చేయగలిగే పట్టుదల ఉంది. ఆ నమ్మకం, పట్టుదలతోనే రాయడం, బొమ్మలు వేయడం నేర్చుకుంది. ఈ రోజు ఏకంగా నేషనల్ హ్యాండ్ రైటింగ్ పోటీలలో విజేతగా నిలిచి నికోలాస్ మ్యాక్సిమ్ అవార్డును సొంతం చేసుకుంది. ఏటా కేవలం ఇద్దరికే ఇచ్చే ఆ అవార్డును చేతులు లేని సారా గెలుపొందడంతో సారా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. సారా మేరీల్యాండ్‌లోని సెయింట్ జాన్స్ అనే స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది. చైనా నుంచి నాలుగేళ్ల క్రితం అమెరికాకు వచ్చిన సారా తన సోదరి సాయంతో ఇంగ్లీషు చదవడం, మాట్లాడటం, రాయటం నేర్చుకుంది. సారా ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టదని ఆమె తల్లి, అధ్యాపకులు చెబుతున్నారు. సారా అక్షరాలను రాయడం ఎంజాయ్ చేస్తోందని.. అక్షరాలను ఒక ఆర్ట్‌గా భావిస్తోందని అధ్యాపకులు చెప్పారు. సారా ఖాళీగా ఉన్న సమయాలలో తన చుట్టూ కనిపించే వాటిని బొమ్మలుగా వేస్తుంటుంది. అంతేకాకుండా సారాకు స్విమ్మింగ్ అన్నా, తన సోదరితో ఆడుకోవడం అన్నా చాలా ఇష్టమట. సారా గెలుచుకున్న అవార్డును జూన్ 13న అనేక మంది అతిథుల మధ్య తీసుకోనుంది. అవార్డుతో పాటు సారా 500 డాలర్ల రివార్డును కూడా గెలుచుకుంది.