Four-Indian-Americans-win-state-and-local-Elections-in-US

అమెరికా ఎన్నికల్లో నలుగురు భారతీయుల విజయఢంకా

వాషింగ్టన్: అమెరికా స్థానిక ఎన్నికల్లో నలుగురు భారత సంతతి అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో ఓ ముస్లిం మహిళతో పాటు మాజీ వైట్ హౌస్ టెక్నాలజీ పాలసీ సలహాదారు కూడా ఉండడం విశేషం. మంగళవారం జరిగిన రాష్ట్ర, స్థానిక ఎన్నికల్లో నలుగురు ఇండియన్స్ గజాలా హష్మి, సుహాస్ సుబ్రమణ్యం, మనో రాజు, డింపుల్ అజ్మీరా విజయఢంకా మోగించారు. వర్జీనియా స్టేట్ సెనేట్‌కు ఇండో-అమెరికన్ అయిన గజాలా హష్మి ఎన్నికైంది. మాజీ కమ్యూనిటీ కళాశాల ప్రొఫెసర్ అయిన హష్మి వర్జీనియా స్టేట్ సెనేట్‌కు ఎన్నికైనా తొలి ముస్లిం మహిళగా కూడా రికార్డుకెక్కారు. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన హష్మి ప్రత్యర్థి సెన్ గ్లెన్ స్టుర్ట్‌వెంట్‌ను ఓడించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విజయం తనది మాత్రమే కాదన్నారు. ఎవరైతే వర్జీనియాలో మార్పు కావాలని కోరుకున్నారో వారందరికీ చెందుతుందన్నారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన హష్మికి మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ ట్విట్టర్ ద్వారా ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్పారు. భర్త అజార్‌తో కలిసి 1991లో వర్జీనియాలోని రిచ్మండ్ వెళ్లారు హష్మి. పాతికేళ్లు వర్జీనియా కళాశాల, యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా సేవలు అందించారు.  

మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వ హయాంలో వైట్ హౌస్ టెక్నాలజీ పాలసీ సలహాదారుగా పనిచేసిన సుహాస్ సుబ్రమణ్యం వర్జీనియా స్టేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌గా ఎన్నికయ్యారు. బెంగళూరుకు చెందిన సుబ్రమణ్యం అమ్మగారు 1979లో అమెరికాలో అడుగుపెట్టారు. ఆమె డల్లాస్‌లో ఫిజీషియన్‌గా పనిచేశారు. అనంతరం సుబ్రమణ్యం కూడా కాపిటల్ హిల్లో ఆరోగ్య సంరక్షణ, అనుభవజ్ఞుల విధాన సహాయకుడిగా పనిచేశారు. అదే సమయంలో టెక్నాలజీ మరియు రెగ్యులేటరీ అటార్నీగా విధులు నిర్వహించారు. దీంతో ఒబామా ప్రభుత్వంలో వైట్ హౌస్ టెక్నాలజీ పాలసీ సలహాదారుగా పనిచేశారు. 

కాలిఫోర్నియాలో మరో భారత సంతతి వ్యక్తి మనో రాజు కూడా స్థానిక ఎన్నికల్లో విజయం సాధించారు. అలాగే నార్త్ కరోలినాలో డింపుల్ అజ్మీరా గెలిచారు. పదహారేళ్ల వయసులో పేరెంట్స్‌తో కలిసి యూఎస్ వెళ్లిన డింపుల్ మాజీ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్. అమెరికా వెళ్లిన కొత్తలో ఆమెకు ఇంగ్లీష్ వచ్చేది కాదట. ఆ తరువాత దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యూయేట్ పూర్తి చేసి సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ అయ్యారు.