Florida-Woman-Urinates-And-Spits-in-Rivals-Ice-Cream-Machine

ఐస్‌క్రీం పార్లర్‌లో ఫ్లోరిడా మహిళ నీచమైన పని.. ఎందుకో తెలిస్తే...

ఫ్లోరిడా: పక్కవాళ్ల ఐస్‌క్రీం పార్లర్ బాగా రన్ అవుతుండడం చూసి తట్టుకోలేకపోయిన ఓ మహిళ వారి బిజినెస్‌ను దెబ్బ తీసేందుకు నీచమైన పనికి ఒడిగట్టింది. ఐస్‌క్రీం తయారు చేసే యంత్రాలపై మూత్ర విసర్జన, ఉమ్మివేయడంతో పాటు చీము కారుతున్న ఆమె చేతి వేళ్లతో ఐస్‌క్రీంలను ముట్టుకోవడం చేసింది. ఈ దృశ్యాలన్నీ పార్లర్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దాంతో పార్లర్ యజమాని సదరు మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సెయింట్ పీటర్‌బర్గ్స్‌కు చెందిన జంగ్ సూన్ వీప్చా(66) అనే మహిళ ఫ్లోరిడా  కన్వీనియెన్స్ స్టోర్‌లో పనిచేస్తోంది. ఈ స్టోర్‌కు పక్కనే లూలూస్ ఐస్‌క్రీం పార్లర్ ఉంది. ఈ పార్లర్‌కు బాగా జనాదరణ ఉండేది. కస్టమర్ల అభిరూచి మేరకు వారికి కావాల్సిన ఐస్‌క్రీం ఐటంలను తయారు చేసి ఇచ్చేవారు. దీంతో అనతి కాలంలోనే పార్లర్‌కు మంచి పేరు వచ్చింది. దాంతో పార్లర్‌కు ప్రతీరోజు భారీ సంఖ్యలో జనాలు క్యూ కట్టేవారు. అది చూసి జంగ్ సూన్‌కు కన్నుకుట్టింది. దీంతో ఎలాగైన లూలూస్‌కు భారీ నష్టం కలిగించాలని తలచింది. 

దీనిలో భాగంగా ప్రతీరోజు లూలూస్ ఐస్‌క్రీం పార్లర్‌లోని టాయిలెట్స్‌కు వెళ్లడం, ఆ తరువాత చేతులు కడుక్కొకుండానే బయటకు వచ్చి ఐస్ క్రీంలను ముట్టుకోవడం చేసేది. అంతటితో ఆగకుండా పార్లర్‌లో ఎవరు లేని సమయంలో ఐస్‌క్రీంలు తయారు చేసే యంత్రాలపై మూత్ర విసర్జన, ఉమ్మివేయడం చేసింది. అలాగే చీము కారుతున్న చేతి వేళ్లతో పార్లర్‌లోని ఐటంలను తాకడం చేసేది. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఆ వీడియో చూసిన షాప్ యజమాని పాల్ చివుల్లి ఫ్లోరిడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాల్ ఫిర్యాదు మేరకు జంగ్ సూన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విచారించగా జంగ్ చెప్పిన విషయాలు పోలీసులను నిర్ఘాంతపోయేలా చేశాయి. కేవలం పాల్‌కు నష్టం కలిగించేందుకు ఈ నీచానికి పాల్పడినట్టు ఆమె చెప్పింది. ఈ ఘటన వల్ల పాల్ ఐస్‌క్రీం పార్లర్ నాలుగైదు రోజులు మూత పడింది. దాంతో అతడికి లక్ష 36వేల వరకు నష్టం వాటిల్లింది. దీనికి కారణమైన జంగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.