Florida-manager-chased-employee-with-knife

ఇంటికెళ్తానంటే ఉద్యోగి కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి కత్తితో వెంటపడిన మేనేజర్..

ఫ్లోరిడా: తన షాపులో పనిచేసే ఉద్యోగి ఇంటికెళ్తానంటే ఆ మేనేజర్‌కు కోపమొచ్చింది. అర్థరాత్రి వరకు పని చేయాల్సిందేనని ఆల్టిమేటం ఇచ్చింది. దానికి ఉద్యోగి ఒప్పుకోకపోవడంతో మేనేజర్ ఆగ్రహం అవధులు దాటింది. ఉద్యోగి కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టింది. అతను పెద్దగా కేకలు వేస్తూ బయటకు పరిగెత్తడంతో వంటగదిలోని కత్తి తీసుకొని అతని వెంటబడింది. ఫ్లోరిడాలోని ప్రముఖ సంస్థ ‘అర్బీస్’ చెందిన ఓ శాఖలో జరిగిన ఈ ఘటన అక్కడ పనిచేసే మిగతావారిని షాక్‌కు గురిచేసింది. తమ మేనేజర్ లె టెర్రా అకిన్స్ అనే 21 ఏళ్ల యువతి అలా చేస్తుందని వారు అసలు ఊహించలేదు. దీనిపై బాధిత ఉద్యోగి ఎర్నెస్ట్ పాయింట్ డు జూర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అకిన్స్‌ను అరెస్టు చేశారు. అసలు గొడవేంటని ప్రశ్నించగా.. షిఫ్ట్ సమయం అయిపోవడంతో ఇంటికెళ్తానని ఎర్నెస్ట్ అడిగాడని, దానికి అకిన్స్ అంగీకరించకుండా గొడవకు దిగిందని అర్బీస్‌లోని మిగతా ఉద్యోగులు తెలిపారు. అర్ధరాత్రి వరకు పని చేయమని ఆమె బలవంతం చేయడంతో ఎర్నెస్ట్ కూడా గొడవపడ్డాడని చెప్పారు. ఆ సమయంలో ఎర్నెస్ట్ కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన అకిన్స్.. అతను పరిగెత్తడంతో కత్తి తీసుకొని ఎర్నెస్ట్‌ను వెంబడించిందని వెల్లడించారు. ఈ ఘటనలో ఎర్నెస్ట్‌కు పెద్దగా గాయాలవ్వలేదని పోలీసులు పేర్కొన్నారు.