Florida-man-accused-of-giving-beer-to-an-alligator

మొసలికి బీర్ పట్టించిన ఇద్దరు యువకులు.. అనంతరం..

ఫ్లోరిడా: మొసలిని చట్టవిరుద్దంగా ఇంట్లో పెట్టుకున్న ఇద్దరు యువకులను ఫ్లోరిడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ వ్యక్తి మొసలిని పెంచుకుంటున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదులో వ్యక్తికి సంబంధించిన వీడియో కూడా ఉండటంతో ఆ వ్యక్తి పేరు టిమొతీ కెప్కే(27) అని పోలీసులు తెలుసుకున్నారు. వీడియోలో ఓ మొసలి కెప్కే చేతిపై గాయం చేయడం రికార్డ్ అయింది. అంతేకాకుండా కెప్కే ఆ మొసలికి బీర్ పట్టించడం కూడా ఉంది. దీంతో సెప్టెంబరు 17న కెప్కే ఇంటికి వెళ్లిన పోలీసులు అతడిని, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో వెతకగా.. మొసలిని అప్పటికే వదిలేశామని కెప్కే సమాధానమిచ్చాడు. 

ఆగస్ట్ 26న తన స్నేహితుడు నోవా ఆస్బోర్న్(22)కు పామ్ సిటీలో మొసలి దొరికినట్టు, అతడే ఇంటికి తీసుకొచ్చినట్టు వివరించాడు. మొసలికి అప్పుడప్పుడు బీర్ పట్టించామని ఒప్పుకున్నాడు. అయితే తన చేతిపై దాడి చేసిన సమయంలో మొసలికి ఎటువంటి మద్యం అందించలేదని చెప్పుకొచ్చాడు. తన స్నేహితురాలు కూడా ఆ సమయంలో ఉందని.. కావాలంటే ఆమెను కూడా విచారించమని తెలిపాడు. కెప్కే చేసిన వింత చేష్టల కారణంగానే మొసలి చేతిపై దాడి చేసినట్టు యువతి స్పష్టం చేసింది. కాగా, చట్టానికి వ్యతిరేకంగా మొసలిని ఇంటికి తీసుకొచ్చినందుకు, మద్యాన్ని అందించినందుకు గాను కెప్కేను, ఆస్బోర్న్‌ను అక్టోబర్ 3న పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిద్దరూ బెయిల్‌పై విడుదలయ్యారు.