Favourite-things-of-travelling-Indians

విదేశాలకు వెళుతోన్న భారతీయులకు ఇష్టమైనవి... కష్టమైనవి ఏంటంటే...

ఆస్ట్రేలియా, స్పెయిన్‌, బాలి, గ్రీస్‌... ఇలా ఏ దేశమైనా సాగరతీరాలే మా హాట్‌ఫేవరెట్‌ అంటున్నారు భారతీయులు. ఓ ట్రావెల్‌ సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. విదేశీ పర్యటనలకు వెళుతోన్న భారతీయులకు ఇష్టమైనవి... కష్టమైనవి ఏంటంటే...

మన వంటే పసందు
ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ముందుగా మనోళ్లు వెతికేది ఆహారం గురించే! కొంత మంది ఎలాంటి ఆహారాన్నైనా తినడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఇంటి వంటకే అలవాటు పడిపోయిన వారికి ఆహారం విషయంలో పట్టింపు ఉంటుంది. అందుకే ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల వెజిటేరియన్‌, వేగన్‌ రెస్టారెంట్లు వెలిశాయి. ఒకవేళ భారతీయ వంటకాల జాడ లేకపోతే, ఆ పూట భోజనం చేయని భారతీయులు 81 శాతం ఉన్నారట!
 
పోస్టింగ్‌లోనూ ఫస్టే!
ఇప్పుడు ఏ పని చేసినా సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడం ఓ ఫ్యాషన్‌గా మారింది. ఇక విదేశీ పర్యటనలకు వెళితే ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లలో ఫోటోలు, వీడియోలు పోస్ట్‌ చేస్తున్న వారు 69 శాతం మంది ఉన్నారు.
 
సాగరతీరంలో హాయిగా...
కొంత మంది చారిత్రక కట్టడాలు చూడాలనుకుంటారు. మరికొందరు ప్రకృతిని ఆస్వాదించాలనుకుంటారు. కానీ చాలా మంది భారతీయ పర్యాటకులు బీచ్‌ డెస్టినేషన్లకే ఓటేశారు. 71 శాతం మంది సాగరతీరాల్లో సేదతీరడానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారట.
 
ఖర్చయినా డోంట్‌కేర్‌!
విదేశీ పర్యటనలకు తరచుగా వెళ్లేవారు అక్కడ ఖర్చుకు మాత్రం వెనుకాడటం లేదట. ఒక్కో వ్యక్తి మీద రూ.25 వేల భారం పడుతోందట. ఇక 17 శాతం మంది అయితే 50 వేలు, 27 శాతం మంది రూ. 10 వేలు ఖర్చు చేశారని ఈ సర్వే ద్వారా వెల్లడైంది.
 
స్టార్‌ హోటళ్లే కావాలి!
ఇటీవలి కాలంలో ట్రావెలింగ్‌ యాప్స్‌ సంఖ్య పెరిగింది. విమాన టికెట్లతో పాటు హోటల్‌ గదులను రేటింగ్‌ చూసుకొని మరీ బుక్‌ చేసుకునే సౌకర్యం ఉంది. ఇటీవలి కాలంలో విశాఖపట్నం, గౌహతి, అమృత్‌సర్‌, వారణాసి లాంటి మధ్యస్థాయి నగరాల నుంచి విదేశాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో మూడో వంతు మంది 4 స్టార్‌, 5 స్టార్‌ హోటళ్లలోనే బస చేస్తున్నారు.