Extreme-snow-storm-hits-central-US-with-millions-in-bombogenesis-path

అమెరికా నెత్తిన మంచుబాంబు

డెన్వర్, మార్చి 14: మంచు తుఫానుతో అగ్రరాజ్యం వణికిపోతోంది. రాకీ పర్వతాల నుంచి భారీగా వీస్తున్న చలిగాలుల ధాటికి 25 రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. గంటకు 120-160 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు తోడు మంచు విపరీతంగా కురుస్తుండటంతో కొలరాడో, నెబ్రాస్కా, డకోటాలోని ప్రధాన రహదారుల్లో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. డెన్వర్‌లో 10-20 సెంటీ మీటర్ల మేర మంచు దట్టంగా పేరుకుపోయింది. రహదారులపై వాహనాలు ఢీకొనడం వల్ల 125 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. హిమపాతం కారణంగా డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఆరు రన్‌వేలను తాత్కాలికంగా మూసివేశారు. 1339 విమానాలు రద్దయ్యాయి. కొలరాడో ఈశాన్య ప్రాంతంలో మంచు తుఫాను హెచ్చరికలు జారీ అయ్యాయి. 

మంచు తుఫాను బీభత్సంతో ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇంటి నుంచి బయటకు రావడం తగ్గించాలని కోరారు. మంచు తుఫాను ప్రభావిత రాష్ట్రాల్లోని స్కూళ్లకు, ఇతర విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పోలీసులు, అత్యవసర విభాగ అధికారులు అందుబాటులో ఉండి.. ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు.