Expect-up-to-10-percent-India-sales-Growth-says-Triumph-Motorcycles

భారత్‌లో 10 శాతం పెరుగుదల ఆశిస్తున్నాం: ట్రయంఫ్‌

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జూన్‌లోపు భారత్‌లో తమ బైకుల అమ్మకాలు 5 నుంచి 10 శాతం వరకు పెరుగుతాయని బ్రిటన్‌కు చెందిన ట్రయంఫ్‌ మోటార్‌సైకిల్స్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. జూలై-జూన్‌ను ఆర్థిక సంవత్సరంగా పరిగణించే ట్రయంఫ్‌, వచ్చే నెల నుంచి 2020 జూన్‌లోపు రెండు కొత్త వాహనాలను తీసుకురావాలని యోచిస్తోంది. అవి తమ వృద్ధికి దోహదపడతాయని ధీమా వ్యక్తం చేస్తోంది. రూ.18 లక్షల ధర కలిగిన ప్రీమియం మోడల్‌ రాకెట్‌ 3ఆర్‌ను ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇకపై తమనుంచి వచ్చే బైకులన్నింటినీ బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగానే రూపొందించనున్నామని ట్రయంఫ్‌ పేర్కొంది. గత ఏడాది సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే.. ఈసారి 9 నుంచి 10 శాతం వృద్ధిని సాధించామని, డిసెంబరులో సైతం 5 నుంచి 10 శాతం వృద్ధిని ఆశిస్తున్నామని వెల్లడించింది. ఇప్పటి స్థాయిలోనే అమ్మకాలు కొనసాగితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1000 మోటార్‌సైకిళ్లను విక్రయిస్తామని సంస్థ ధీమా వ్యక్తం చేసింది.