Ex-MLA-Jagga-Reddy-sent-to-judicial-custody..-Actual-reason-is

అమెరికాకు అక్రమ రవాణా.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి రిమాండ్

మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారు

నకిలీ ధ్రువపత్రాలతో పాస్‌పోర్టు
ముగ్గురు వ్యక్తులను అమెరికా పంపించారు
ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు వసూలు
2004 కేసులోనే జగ్గారెడ్డి అరెస్టు: డీసీపీ సుమతి
25 వరకు రిమాండ్‌ .. చంచల్‌గూడ్‌ జైలుకు తరలింపు
అడ్డగుట్ట/సైదాబాద్‌/సంగారెడ్డి టౌన్‌/హైదరాబాద్‌, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): నకిలీ ధ్రువపత్రాలతో పాస్‌పోర్టు తీసుకుని, మానవ అక్రమ రవాణాకు పాల్పడినందుకే కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్టు చేసినట్లు ఉత్తర మండలం డీసీపీ సుమతి తెలిపారు. ఆయన తన కుటుంబ సభ్యుల పేరుతో ముగ్గురు వ్యక్తులను అమెరికా తీసుకెళ్లారని, 2004 సెప్టెంబరు 24కు సంబంధించిన ఈ కేసును విశ్వనీయ సమాచారం మేరకు మార్కెట్‌ పోలీస్ స్టేషన్‌ ఎస్‌ఐ అంజయ్య సుమోటోగా తీసుకున్నారని పేర్కొన్నారు. తమ విచారణలో పాస్‌పోర్టులో మారుపేర్లతో ఉన్న ముగ్గురు వ్యక్తుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.5 లక్షలు తీసుకున్నట్లు జగ్గారెడ్డి అంగీకరించాడని తెలిపారు. మధు అనే మధ్యవర్తి కోసం గాలిస్తున్నామని, కుసుమ కుమార్‌ అనే వ్యక్తిని కూడా విచారించాల్సి ఉందని డీసీపీ చెప్పారు. అమెరికాకు వెళ్లిన ఆ ముగ్గురు ఎవరనేది గుర్తించాల్సి ఉందన్నారు.
 
ఇదిలా ఉండగా.. మంగళవారం ఉదయం పోలీసులు గాంధీ ఆస్పత్రిలో జగ్గారెడ్డికి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి నర్సిరెడ్డి ఆయనకు ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. కాగా తనపై సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు కుట్రపూరితంగా కేసులు పెట్టించారని జగ్గారెడ్డి ఆరోపించారు. వైద్య పరీక్షల సమయంలో ఆస్పత్రి ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంగారెడ్డిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించేందుకు కుట్ర పన్నారని దుయ్యబట్టారు. మరోవైపు సంగారెడ్డిలో బంద్‌కు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, డీసీసీ అధ్యక్షురాలు సునితారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
 
కాంగ్రెస్‌ స్థైర్యాన్ని దెబ్బతీయలేరు: ఉత్తమ్‌
అక్రమ అరెస్టులతో కాంగ్రెస్‌ కేడర్‌ మనో స్థైర్యాన్ని దెబ్బతీయలేరని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహల అరెస్టులను ట్విటర్‌లో ఉత్తమ్‌ ఖండించారు.
 
దేశద్రోహులకు మద్దతా?: పద్మాదేవేందర్‌ రెడ్డి
జగ్గారెడ్డికి కాంగ్రెస్‌ నేతలు మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు. సైన్యంలో పని చేశానని, దేశ భక్తుడినని గొప్పలు చెప్పుకొనే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. మహిళల అక్రమ రవాణాతో దేశ ద్రోహానికి పాల్పడిన జగ్గారెడ్డిని విడుదల చేయాలని పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకురావడం దారుణమన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. మహిళా మంత్రిగా వ్యవహరించిన సునీతాలక్ష్మారెడ్డి సైతం జగ్గారెడ్డిని విడుదల చేయాలనడం మహిళలను అవమానపరచడమేనన్నారు. కాగా.. జగ్గారెడ్డిని నమ్మి తాము అప్పుల పాలయ్యామని సంగారెడ్డి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆర్‌.వి.గోవర్ధన్‌ నాయక్‌, మాజీ వైస్‌ చైర్మన్‌ జలాలుద్దీన్‌ బాబా అన్నారు.
 
కాసుల కక్కుర్తితోనే నకిలీ పాస్‌పోర్టుల సృష్టి
పెద్ద మొత్తంలో చేతికందే డబ్బు కోసమే పలువురు నేతలు నకిలీ ధ్రువపత్రాలతో మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. 1993 నుంచి కొనసాగుతున్న ఈ దందాను మొదట ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఈ మొత్తం రాకెట్‌కు సూత్రధారి అయిన బీజేపీ ఎంపీ బాబుబాయ్‌ కటారా సహా ఆయన పీఏ రాజేందర్‌ గంపా, ఢిల్లీలో పాన్‌షాపు యజమాని సుందర్‌లాల్‌ యాదవ్‌తోపాటు మరికొందరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుందర్‌లాల్‌కు దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఉంది. అతడి ప్రధాన అనుచరులు ప్రకాశ్‌ రెడ్డి, రషీద్‌, షకీల్‌గా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ కేసులో తెలంగాణకు చెందిన అప్పటి ఎమ్మెల్యేలు కాసిపేట లింగయ్య, సోయం బాపురావు అరెస్టయ్యారు.