Ethiopian-Woman-Wrote-Exam-After-30-Minutes-Delivering-a-Baby

బిడ్డకు జన్మనిచ్చిన అర్ధగంటకే.. ఆసుపత్రి బెడ్‌పైనే పరీక్ష రాసిన మహిళ...

ఇథియోపియా: బిడ్డకు జన్మనిచ్చిన అర్ధగంటకే ఆసుపత్రి బెడ్‌పైనే పరీక్ష రాసి నెటిజన్లతో 'వండర్ వుమెన్' అనిపించుకుంటోంది ఇథియోపియాకు చెందిన 21 ఏళ్ల ఆల్మేజ్ డెరెస్ అనే మహిళ. పశ్చిమ ఇథియోపియాలోని మెటులో నివాసముండే డెరెస్ ఆసుపత్రి బెడ్‌పై పరీక్ష రాస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా ఆమె పరీక్షలు ముందే జరిగాల్సిందట. కానీ, రంజాన్ పండుగ సందర్భంగా  ఎగ్జామ్ తేదీలు మారడం, అవి కాస్తా డెరెస్ డెలివరీ రోజునే కావడంతో ఆమె ఇలా ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన అర్ధగంటకే పరీక్షకు హాజరైంది. ఆల్మేజ్ తన ఇంగ్లీష్, ఆమ్హరిక్, మ్యాథ్స్ పేపర్లను ఇలా ఆసుపత్రి బెడ్‌పైనే రాసింది. 

తన తరువాతి పరీక్షలను ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా తరువాత ఎగ్జామినేషన్ సెంటర్‌లోనే రాయనుంది. 17 ఏళ్లకే పెళ్లి చేసుకున్నఆల్మేజ్ ప్రగ్నెన్సీ వల్ల తన గ్రాడ్యుయేషన్‌కు ఎలాంటి ఆటంకం కలగకూడదని ముందే నిర్ణయించుకుందట. దీంతో బిడ్డకు జన్మనిచ్చిన అర్ధగంటకే ఎగ్జామ్ రాసింది. లేకపోతే ఒక ఏడాది పాటు పరీక్షల కోసం వేచిచూడాల్సిన పరిస్థితి వచ్చేదని ఆల్మేజ్ చెప్పుకొచ్చింది. ఇక గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయడంలో భర్త టాడ్సె టూలు సహకారం మరవలేనిదని ఆమె పేర్కొంది. మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆల్మేజ్... ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇదే కోవలో గతేడాది కూడా ఆఫ్గనిస్థాన్‌కు చెందిన 25 ఏళ్ల జాహాన్ టాబ్ అనే మహిళ అప్పుడే పుట్టిన బిడ్డతో నేలపై కూర్చొని యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష రాసి సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే.